విద్యానగర్, ఏప్రిల్ 22 : కరీంనగర్‌లోని రెనె హాస్పిటల్లో బీఎన్‌రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిళలకు నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని బీఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీఎన్ రావు సూచించారు. కరీంనగర్‌లోని రెనె హాస్పిటల్లో మహిళా వైద్యులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే పూర్తిగా నయం చేసే వీలుంటుందన్నారు. హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో పిల్లల్లో రక్తహీనతతో పాటు మహిళల అనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు.
ఇటీవల ఎక్కువ మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారికి అవగాహన కల్పించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. శిబిరంలో గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ఉచిత నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో రూ.6 వేల విలువైన మమోగ్రామ్ టెస్ట్, రూ.1600 విలువైన పాప్టెస్ట్ ఉన్నాయని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర బ్యాంక్ తరఫున మేనేజర్ వైద్య శిబిరానికి రూ. లక్ష విరాళం అందజేశారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ బంగారి రజినీప్రియదర్శిని, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ చేతన, జాహ్నవి, సంగీత, మానస, శ్రీదేవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చు
క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. ఎక్కువ మంది క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరిన తర్వాతే దవాఖానలకు వస్తున్నారు. అప్పటికే మూడు, నాలుగో స్టేజీల్లో ఉండడంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. గతంలో మహిళా వైద్యులతో కృష్ణ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. ఇప్పుడు సైతం కృష్ణ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ బంగారి రజినీప్రియదర్శిని, గైనకాలజిస్టు
మహిళల్లో బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్లే ఎక్కువ
మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ల వల్లే మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్యాన్సర్లపై అవగాహన లేకపోవడమే కారణం. క్యాన్సర్లలో నాల్గు స్టేజీలుంటాయి. 35 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ సంవత్సరానికోసారి బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మమోగ్రామ్, ప్రతి మూడేళ్లకోసారి సర్వికల్ క్యాన్సర్ కోసం పాప్స్మీమ్ చేయించుకోవాలి. జిల్లాలో పూర్తి స్థాయిలో క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ రేడియేషన్, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని క్యాన్సర్లకు చికిత్స ఆరోగ్య శ్రీలో అందుబాటులో ఉంది. పట్టణాల్లో కంటే గ్రామీణ స్థాయిలోనే క్యాన్సర్ వ్యాధి బారిన ఎక్కువ మంది పడుతున్నారు. పట్టణాల్లో కొంతవరకు అవగాహన వచ్చింది.
– డాక్టర్ చేతన, మెడికల్ అంకాలజిస్ట్