కార్పొరేషన్, ఏప్రిల్ 20: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారుకు మంత్రి గంగుల చేయూతనిచ్చారు. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంలో ఏదైనా ఒక స్కూల్కు తన సోదరుడి పేరిట 20లక్షల విరాళం ఇస్తానని ప్రకటించారు. బుధవారం తీగలగుట్టపల్లిలోని మండల ప్రాథమిక పాఠశాలలో 65.45 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.
బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఇందులో భాగంగానే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడుత 9123 స్కూళ్లకు కొత్తరూపు తేనున్నట్లు పేర్కొన్నారు. 74 ఏండ్ల సమైక్యాంధ్ర పాలనలో కేవలం 16 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవని, వాటిలో 9వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేండ్లలోనే 281 గురుకులాలు స్థాపించి లక్ష 35 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని, రాజకీయాలకతీతంగా విద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని ఏదైనా సూ లుకు వాడుకునే విధంగా తన సోదరుని పేరిట రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. స్కూ ల్ బాగుకు దాతలు ఎవరైనా రూ.కోటి విరాళం ఇస్తే ఆ స్కూల్కు వారు కోరిన వారి పేరును పెడతామని, రూ.10 లక్షలు ఇస్తే తరగతి గదికి పేరు పెడతామని వెల్లడించారు. రూ.2 లక్షలు ఇస్తే సూల్ మేనేజ్ మెంట్ కమిటీలో సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకప్పుడు నిరుపేదలు ఇంట్లో ఎల్లక తమ పిల్లలను స్కూల్ మాన్పించి తమ వెంట పనులకు తీసుకెళ్లేవారని, కానీ ఇప్పుడు ఆ కూలీలే తమ బిడ్డలను ఉన్నతంగా చదివించాలని తాపత్రయపడుతున్నారని, అలాంటి పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకే మన ఊరు-మన బడి చేపట్టామని తెలిపారు.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ‘మన ఊరు – మనబడి’, ‘మన బస్తీ – మన బడి’ కింద జిల్లాలో 230 పాఠశాలలను ఎంపిక చేసినట్లు వివరించారు. పాఠశాలల అభివృద్ధికి విరాళాలు అందించేందుకు దాతలు ముందు కు రావాలని సూచించారు. నగర మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ కరీం‘నగరం’లో 10కోట్ల వ్యయం తో నగరపాలిక ఆధ్వర్యం లో 25 ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీ టుగా ఆధునీకరిస్తామని వెల్లడించారు. ఇక్క డ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప హరి శంకర్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు కాశెట్టి లావణ్య శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు బీ పద్మ నాగేశ్వర చారి, ఎస్ఎంసీ జీ అనూష పాల్గొన్నారు.
ముందుకు వచ్చిన దాతలు
తీగలగుట్టపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. స్థానిక కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్ లక్ష విరాళం ప్రకటించగా, పూర్వ విద్యార్థి గాండ్ల శ్రీనివాస్ అనే దాత 20 వేల చెకును అందించారు.