ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 20: సర్కారు నిర్మించి ఇస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లతో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికే అవకాశం కలుగుతున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. సొంతజాగ కలిగి ఉన్న వారికి రూ. 3లక్షలు ఇచ్చేందుకు సర్కారు సంసిద్ధంగా ఉన్నదన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నదని చెప్పారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో 41 డబుల్ బెడ్రూం ఇండ్లను జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి మరో 30 ఇండ్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు.
త్వరలోనే డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ప్రతిఒక్కరూ రెండు మొక్కలు నాటి సంరక్షించాలని లబ్ధిదారులకు సూచించారు. కాగా సర్పంచ్ నేమూరి లతా సత్యనారాయణ లబ్దిదారులకు చీరె, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చిత్రపటాలను అందజేశారు. అంతకుముందు మహిళలు, ప్రజాప్రతినిధులను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. లబ్ధిదారులు మంగళ హారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, జడ్పీటీసీ కంఠం భారతి, తహసీల్దార్ మహేశ్వర్, ఎంపీడీవో ప్రభు, సింగిల్ విండో చైర్మన్ బద్దం గోపి, ఈవో నారాయణ, ఉప సర్పంచ్ రాంరెడ్డి, మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, నాయకులు గూడ పాపన్న, అల్లూరి రఘుపతి, సంగం సాగర్, గుండి దేవయ్య, జింక శ్రీనివాస్, చల్ల దేవదాస్, గొల్ల నరేందర్, దొంతుల తుకారాం ఉన్నారు.
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం మాది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే నిరుపేదలకు మేలు జరుగుతున్నది. ఎమ్మెల్యే సారు మమ్ములను గుర్తించి ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఇగ నుంచి రందీలేకుంట బతుకుతం. ఇల్లు ఇచ్చిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సార్లకు రుణపడి ఉంటం.
– బూసారపు కవిత, కూలి.