ధర్మారం, ఏప్రిల్ 20: ప్రజా సంక్షేమమే పరమావధిగా.. అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. ముఖ్యంగా ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ‘హ్యపీ బర్త్ డే సర్’ అంటూ విషెస్ చెప్పారు. కాగా, మంత్రి ఈశ్వర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా మంత్రి కొప్పుల బుధవారం ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పులకు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొప్పులకు ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రేఖాశ్యాం నాయక్, సంజయ్‌కుమార్, క్రాంతి కిరణ్ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఇక జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పీహెచ్సీ చైర్మన్ కోలేటి దామోదర్ హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్లో మంత్రి కొప్పులను స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇక పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.
పూజలు చేసి.. వీఎం హోంలో కేక్ కట్ చేసి..
మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి బల్కంపేట ఎల్లమ్మ తల్లీని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అమీర్‌పేట శిశువిహార్‌లో చిన్నారులతో, కొత్తపేట వీఎం హోంలో బాలబాలికలతో కలిసి బర్త్‌డే కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించారు. వీఎం హోంలో అన్నదానం చేసి అక్కడే చిన్నారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుని మొక్కను నాటారు. అలాగే సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతో విజయవంతంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో “ది కింగ్ ఆఫ్ హ్యుమానిటీ’పేరిట రూపొందించిన బుక్‌లెట్‌ను పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రముఖులు శ్రీనివాస్ రావు ఉన్నారు.