కరీంనగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 42 డిగ్రీలు రికార్డు కాగా, ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉపశమనం కోసం కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు.
ఎండలు దంచి కొడుతున్నాయి. మరో పదిరోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కానుండగా, అప్పుడే హీటెక్కిస్తున్నాయి. మొన్నటి వరకు 39, 40 డిగ్రీలు మాత్రమే ఉన్న ఉష్ణోగ్రతలు, బుధవారం కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గరిష్ఠంగా 41 డిగ్రీలు, జగిత్యాలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదయ్యాయి. రెండ్రోజుల క్రితం 43డిగ్రీలుగా నమోదైంది. కాగా, భానుడి ప్రతాపంతో ఉదయం 7గంటల నుంచే భగభగలు మొదలవుతున్నాయి. తొమ్మిది గంటల కల్లా ప్రతాపం మొదలై, మధ్యాహ్నం అగ్గి కుర్తంది. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ప్రజలు అల్లాడిపోతున్నారు.
తొమ్మిది గంటల తర్వాత ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, నెత్తికి క్యాపులు, రుమాళ్లు వాడుతున్నారు. ఎండలు తీవ్రతరం కావడంతో ఉపాధి, ఇతర కూలీలు తెల్లవారుజామునే పనుల్లోకి వెళ్లి 11గంటలకల్లా తిరుగుముఖం పడుతున్నారు. ఎండలో ఎక్కువ సేపు ఉంటే వడదెబ్బ ముప్పు ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకొని చల్లపూటే పనులు ముగించుకోవాలని సూచిసున్నారు.
ఎక్కువగా మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే రక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పి, కండ్లు తిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటివి వడదెబ్బ లక్షణాలని, అలాంటి సమయంలో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో ముఖ్యంగా టైఫాయిడ్, పచ్చకామెర్లు, కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడే ప్రమాదముంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎక్కువ బయట తిరుగకపోవడం మంచిది.