కరీంనగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన జిల్లా అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ కాంటాలు, ప్యాడీ క్లీనర్లకు మరమ్మతులు చేయించి, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, నీడ కోసం టెంటు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు.
ధాన్యం తేమశాతం 17 కన్నా ఎకువగా ఉండకూడదని పేర్కొన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని, తాలు ఉంటే రిమార్ కాలంలో రాయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద దళిత బంధులో తీసుకున్న ట్రాక్టర్లను వినియోగించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి, కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం కోతలు జరుగుతున్న చోట కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్, జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్, పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్ రెడ్డి, ఐకేపీ కేంద్రాల ఇన్చార్జిలు, అధికారులు పాల్గొన్నారు.