విద్యానగర్, ఏప్రిల్ 20: ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ డాక్టర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాధారణ ప్రసవాలపై ప్రైవేట్ గైనకాలజిస్టులు, జిల్లా ప్రభుత్వ దవాఖాన, ఎంసీహెచ్ కరీంనగర్, హుజూరాబాద్ గైనకాలజిస్టులు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డెలివరీల్లో ఆపరేషన్‌కు బదులుగా సాధారణ ప్రసవాలను పెంచుటకు తమ వంతు ప్రయత్నం చేయాలని డాక్టర్లకు చెప్పారు. ప్రభుత్వ దవాఖానలు కూడా ప్రైవేట్ వైద్యశాలలకు దీటుగా పనిచేస్తున్నాయన్నారు.
గర్భిణులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు సమన్వయంతో పనిచేయాలని, సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే నోటి క్యాన్సర్ లక్షణాలతో ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారిని డాక్టర్లు చెక్ చేసి సౌకర్యాలున్న వైద్యశాలకు పంపించాలని సూచించారు. దవాఖానలకు వచ్చిన పేషెంట్లకు ట్రీట్మెంట్ విషయంలో జాప్యం కాకుండా సరైన సమయంలో అందించాలని ఆదేశించారు.
పోషణ్ అభియాన్‌లో భాగంగా గ్రామీణ ఆరోగ్య పోషణకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంపునకు ఆశ వరర్లు, అంగన్వాడీ టీచర్లు అన్ని గ్రామాల్లో ప్రతి మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిద, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, డాక్టర్ అలీం, వైద్యాధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్టులు, అధికారులు పాల్గొన్నారు.