సిరిసిల్ల /గంభీరావుపేట, ఏప్రిల్ 19 : అపరభగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్ప బలం.. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఎగువమానేరు జలాశయం పునర్జీవం పోసుకున్నది. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు, నట్టనడి ఎండల్లో కాళేశ్వర జలాలతో నిండుకుండలా మారింది. 2021 ఏప్రిల్ 20న అంటే సరిగ్గా ఇదే రోజు మత్తడి దూకి చరిత్ర సృష్టించింది. మెట్ట ప్రాంతంలో గోదారమ్మ జలసవ్వడి అన్నదాతల్లో ఆనందం నింపింది. ముఖ్యమంత్రి అపరభగీరథ ప్రయత్నానికి మెట్ట ప్రాంతం మురిసిపోయింది. బీళ్లు, నెర్రెలు వారిన చోటే పచ్చని పంట పొలాలు దర్శనమివ్వడమే కాకుండా రెండు కాలాల్లో సిరుల పంట పండింది. ప్రస్తుతం కూడా ప్రాజెక్టులోకి మల్లన్నసాగర్ నుంచి జలాలు వస్తుండగా, 31 అడుగుల నీటి నిల్వ సామర్థ్యానికి 23.3 అడుగుల నీరున్నది.
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతంలోని చెరువులు నెర్రెలుబారి అన్నదాతలను వెక్కిరించేవి. సాగు నీరు లేక పొలాలు బీళ్లుగా మారి కన్నీళ్లు తెప్పించేవి. తాగు, సాగు నీటికి ప్రజలు నానా తంటాలు పడేవారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేవారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంతానికి జీవం వచ్చింది. గ్రామగ్రామానికి నీళ్లు పరవళ్లు తొక్కడంతో మొన్నటిదాకా బీడుగా ఉన్న భూములన్నీ సస్యశ్యామల మవుతున్నాయి. చెరువులు, కుంటలన్నింటికీ జల కళ వచ్చిం ది. మండు టెండల్లోనూ మల్లన్నసాగర్ నుంచి గోదారమ్మ పరుగులతో ఈ నేల పులకరించిపోయింది. కాళేశ్వరం జలాలతో ఎగువమానేరు నిండి మత్తడి దూకి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
మంత్రి కేటీఆర్ చొరవతో జలకళ సాకారం
మెట్టప్రాంతమైన సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి జలతరంగిణిని ఆవిష్కృతం చేశారు. గతేడాది మార్చి 27న మల్లన్నసాగర్ పరిధిలోని తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి కొండ పోచమ్మ కెనాల్ ద్వారా వెళ్తున్న జలాలను గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి వదిలారు. ఈ నీటితో గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో పలు చెక్‌డ్యాంలు, చెరువులు నింపారు. అక్కడి నుంచి ఇదే వాగు ద్వారా ఎగువమానేరు ప్రాజెక్ట్‌లోకి వదిలి సిరిసిల్ల నియోజకవర్గంలో చెరువులను నింపాలని మంత్రి కేటీఆర్ ఈఎన్సీ అధికారులను ఆదేశించడంతో వాగులోకి మళ్లీ నీటిని వదిలారు. ఈ వాగుపై గతంలో నిర్మించిన దాదాపు 36 చెక్‌డ్యాంలు నిండడంతో ఎగువమానేరు వైపు అడుగులు వేసింది. 2021 ఏప్రిల్ 2న ఎగువమానేరు శివారు అయిన బీబీపేట వంతెన నుంచి ప్రాజెక్టులోకి చేరింది.
సరిగ్గా 18 రోజులకు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుని ఏప్రిల్ 20న మత్తడి నుంచి పరవళ్లు తొక్కింది. అయితే వానకాలంలో 13 వేల ఎకరాలు, యాసంగిలో 5 వేల ఎకరాల లక్ష్యంతో ఎగువ మానేరును నిర్మించగా, గతంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో ఎప్పుడో ఒకసారి మాత్రమే నిండేది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడవెల్లి వాగు నుంచి గోదావరి జలాలను శాశ్వతంగా తరలించడానికి మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. సిద్దిపేట జిల్లా కొడగండ్ల వద్ద మల్లన్నసాగర్ కెనాల్‌కు రూ.2 కోట్లతో రెగ్యులేటర్‌ను నిర్మించి అక్కడి నుంచి ఎగువమానేరుకు నీరువచ్చేందుకు మార్గం సుగమమం చేయడంతో సజీవ జల దృశ్యం ఆవిష్కృతమైంది.