సిరిసిల్ల తెలంగాణ చౌక్, ఏప్రిల్ 19 : జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల కార్పొరేట్ స్కూల్‌ను తలదన్నుతున్నది. ఆధునిక హంగులు, సకల వసతులతో గతేడాది మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ‘గీవ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ’ సహకారంతో పాఠశాల అధునాతన హంగులతో చూడముచ్చటగా రూపుదిద్దుకున్నది. ఈ పాఠశాల 1960 సంవత్సరంలో ప్రారంభమై ఎంతో మంది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసింది. ఎన్నో ప్రైవేట్, ఆదర్శ, గురుకుల పాఠశాలలు పోటీకి వచ్చినా ఈ పాఠశాల ప్రస్తుతం సుమారు 900కి పైగా విద్యార్థులతో కళకళలాడుతున్నది. గత పాలకుల నిర్లక్ష్యధోరణితో వసతుల లేమితో విద్యార్థులు ఏళ్ల తరబడి ఇక్కట్లు పడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సీఎస్ఆర్ నిధులు రూ.3 కోట్లతో ‘గీవ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ’ ప్రత్యేక సహకారంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు రోల్ మోడల్‌గా అత్యంత వేగంగా పాఠశాల అభివృద్ధి జరిగింది. ఆధునిక హంగులతో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో తయారైంది.
వినూత్న కార్యక్రమాల సమాహారం
గతంలో అరకొర వసతులున్నా విద్యార్థులు సత్ఫలితాలు సాధించారు. భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గతేడాది మోడల్ రాకెట్ కార్యశాలను ఏర్పాటు చేశారు. స్కూల్ రేడియో నిర్వహిస్తూ విద్యార్థులకు ఆయా అంశాలపై రోజు వారీగా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు అన్ని రంగాలపై అవగాహన వచ్చేందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సీఎస్ఆర్ నిధులు రూ.3 కోట్లతో గీవ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు రోల్ మోడల్‌గా రూపొందించాలని మంత్రి కేటీఆర్ సూచన.
కొత్తగా 400కుపైగా అడ్మిషన్లు
పాఠశాల ఆవరణంలోకి అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం అందరినీ కట్టిపడేస్తుంది. రూ.30లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం, విశాలమైన తరగతి గదులు, అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ, ఇన్నోవేషన్ ల్యాబ్, ప్రాక్టికల్స్ కోసం అకడమిక్ సైన్స్ ల్యాబ్‌లతో కార్పొరేట్ లుక్‌ను తలపిస్తున్న గీతానగర్ పాఠశాలకు అడ్మిషన్లు చాలా పెరిగాయి. గతేడాది సుమారు 600 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఆంగ్ల బోధనతో ఈ విద్యా సంవత్సరం 400 మందికి పైగా విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో ప్రథమస్థానంలో ఉంది.
నూతన ఒరవడి సృష్టించింది
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మా పాఠశాల కార్పొరేట్ పాఠశాలను తలపిస్తున్నది. పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కావాల్సిన అత్యాధునిక వసతులు పాఠశాలలో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం ఒకేసారి 400కు పైగా విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. పాఠశాల అభివృద్ధితో బడిబాట వంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే విద్యార్థుల సంఖ్య పెరగడం నూతన ఒరవడికి నాంది పలికినట్లయింది.
– భాగ్యరేఖ, ప్రధానోపాధ్యాయురాలు
నిరుపేద విద్యార్థులకు వరం
కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవన నిర్మాణంతో పాటుగా వాలీబాల్, ఫుట్‌బాల్ కోర్టులను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చారు. ఒకేసారి 400మంది విద్యార్థులు కూర్చుండి భోజనం చేసేలా అతి పెద్ద డైనింగ్ హాల్‌తో పాటు 12 సీసీ కెమెరాలు, అత్యాధునిక గ్రంథాయలం, మోడ్రన్ టాయిలెట్స్, సురక్షిత తాగునీరు, 50 కంప్యూటర్లతో కూడిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, అధునాతన సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకునేలా పాత భవనాలను కూల్చి మొత్తం 33 రూములతో కొత్త భవనాన్ని నిర్మించారు.
చాలా బాగా అర్థమవుతుంది
మా పాఠశాలలో టీచర్లు బాగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. నేను ఆరో తరగతికి ఈ పాఠశాలకు వచ్చిన. ఇంగ్లిష్ పాఠాలు వినడం మొదటిసారే అయినా చాలా ఈజీగా అనిపిస్తున్నది. మొదట్లో కొంచెం భయమేసింది. తెలుగు మీడియం నుంచి వచ్చిన తోటి విద్యార్థులందరికీ ఆటపాటలతో చదువు చెప్పడం వల్ల ఇంగ్లిష్ అంటే రానురాను భయం పోయింది.
– టీ కార్తీక్, 6వ తరగతి విద్యార్థి