రాంనగర్, ఏప్రిల్ 19: మావోయిస్టు పార్టీకి పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న కొరియర్లను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద వాహనాలు ఆపకుండా వెళ్లిన నిందితులను వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో మీడియా ముందు హాజరుపరిచి సీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. మంగళవారం ఉదయం తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, పోలీసులను చూసి స్విఫ్ట్, స్కార్పియో వాహనాలు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేయగా, పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేయగా డిటోనేటర్లు, సేప్టీ ఫ్యూజ్ వైర్లు, లక్షన్నర నగదు లభ్యం కాగా, అదుపులోకి తీసుకుని తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏసీపీ విజయసారథి, సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి కలిసి విచారించగా వివరాలు వెల్లడించారు.
చత్తీస్ఘడ్ బీడాపూర్ జిల్లాలోని భూపాలపట్నం మండలానికి చెందిన ముడిదెన చిన్నారావు, కోరెం విజయ్‌లు స్నేహితులు. వీరికి మా వోయిస్టు మద్దెడ గిరిజన్ కమిటీ మెంబర్ కట్ట రాంచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, స్టేట్ కమిటీ మెంబర్ కూకటి వెంకటి, మరొక సభ్యుడు రమేశ్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. మావోయి స్టు పార్టీకి అవసరమైన పేలుడు సామగ్రిని చిన్నారావు, విజయ్లే సమకూర్చుతుంటారు. బందిపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బ్లాస్టింగ్ చేసేందుకు పేలు డు పదార్థాలు కావాలని చిన్నారావు, విజయ్‌కు సమాచారం ఇచ్చి, ఇందుకు రూ.3లక్షల నగదు కూడా అందజేశారు. అయితే ఇదివరకు ఉన్న పరిచయాలతో చిన్నారావు, విజయ్ కలిసి భాషవేని రాజయ్యను సంప్రదించగా అతను నాగబోయిన నాగరాజు, గొర్ల బాబు, కస్తూరి రాజుల ద్వారా పేలుడు పదార్థాలు సమకూర్చారు.
మంగళవారం ఉదయం సామగ్రిని తీసుకెళ్లేందుకు చిన్నారావు, మరికొందరు వ్యక్తులతో కలిసి షిప్ట్, స్కార్పియో వాహనాల్లో వచ్చారు. బెజ్జంకి ఎక్స్‌రోడ్ వద్ద సామగ్రిని ఎక్కించుకుని తీసుకెళ్లే క్రమంలో రేణికుంట టోల్‌ప్లాజా వద్ద పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో చిన్నారావుతో పాటు సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన బాసవేన రాజయ్య, అక్కన్నపేటకు చెందిన గొర్ల బాబు, హన్మకొండ జిల్లా గట్ల నర్సింగాపూర్‌కు చెందిన నాగబోయిన నాగరాజు, బీజాపూర్ జిల్లా భూపాలపట్నంకు చెందిన కొండగొర్ల సునీల్ ఉన్నారు.
వీరిపై కేసు నమోదు చేసి వీరికి ఆదేశాలిచ్చిన మావోయిస్టు పార్టీ సభ్యులు కట్టరాంచంద్రారెడ్డి, కూకటి వెంకటి, నగేష్, కోరెం విజయ్, కస్తూరి రాజు, రమేశ్ పరారీలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి వంద డిటోనేటర్లు, 7 బండిళ్ల వైర్లు, రూ.1.45లక్షల నగదు, 4 మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే మావోయిస్టులకు, ఇతర నేరస్తులకు ఎలాంటి సాయం చేసినా, వారితో సంబంధాలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.