రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : నేతన్న సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ఆది నుంచీ చేయూతనిస్తున్నది. రెండేళ్ల క్రితం నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మంత్రి కేటీఆర్ చొరవతో స్కీం అమలుకు మూడేళ్ల కాలానికిగాను ఇప్పటివరకు ఉన్న నిధుల కేటాయింపు 12 కోట్లను 18కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. మొత్తంగా పొదుపు పథకం ద్వారా రాష్ట్రంలోని 30వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుండగా, చేనేత, మరమగ్గాల కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అయితే పథకంలో చేరని వారికి సర్కారు మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి మే 30వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సమైక్య పాలకులు చేనేత రంగంపై దృష్టిసారించారే తప్ప మరమగ్గాల కార్మికులను పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నగరి, చిత్తూరు, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, తెలంగాణలోని సిరిసిల్ల, నల్గొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో కలిపి 70వేల మరమగ్గాలుండేవి. అందులో ఒక్క సిరిసిల్ల జిల్లాలో మాత్రమే 30వేల మరమగ్గాలు ఉండేవి. అయితే ఏటా కేటాయించే నిధుల్లో సింహభాగం ఆంధ్రాకే మళ్లించేవారు. దీంతో సిరిసిల్ల పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టివేయబడి, వందలాది కార్మికులు ఆత్మహత్యలు, ఆకలి చావులకు పాల్పడ్డారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కేటీఆర్ జౌళిశాఖ మంత్రిగా నియామకం కావడంతో సిరిసిల్లకు అదృష్టం కలిసి వచ్చింది. ఇక్కడి కార్మికులు, వస్త్ర పరిశ్రమ స్థితిగతులను అవపోసన పట్టిన ఆయన సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపారు. చేనేత, మరమగ్గాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వాలు బడ్జెట్లో ఈ రంగానికి 300 కోట్లు మాత్రమే కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం 1200 కోట్లు కేటాయిస్తున్నది. కార్మికులకు చేతి నిండా పనికల్పించడంతోపాటు ఆర్థిక భద్రతకు త్రిఫ్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికుడి వాటాగా వేతనంలో 8శాతం బ్యాంకులో జమ చేస్తే.. ప్రభుత్వం మరో 8శాతాన్ని జమచేస్తుంది. ఈ మొత్తం మూడేళ్లలో రెట్టింపవుతుంది. ఇది కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, గత ప్రభుత్వాలు ఈ పథకాన్ని రద్దు చేయ గా, రాష్ట్ర ప్రభుత్వం 2017లో పునరుద్ధరించి 12కోట్లు కేటాయించింది. 8శాతం కార్మికుడు, 8శాతం ప్రభుత్వం జమ చేసింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిశ్రమ మూతపడడంతో మూడేళ్లు పూర్తి కాకుండానే కార్మికులు పొదుపు చేసిన పథకాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించి ఆదుకుంది. ఒక్కో కార్మికుడు 60వేల నుంచి లక్ష వరకు లబ్ధిపొందాడు. అయితే కొన్ని కారణాలతో 2020లో పథకం నిలిచిపోగా, మళ్లీ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూ డేళ్ల కాలానికిగాను గతంలో 12కోట్లు కేటాయించగా, 2022, 24 సంవత్సరానికి 18 కోట్లు కేటాయించింది. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పైచిలుకు చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలుగుతుండగా, ఒక్క సిరిసిల్ల పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలోనే 15వేల మందికి లబ్ధి చేకూరనున్నది.
పథకంలో చేరలేదా..?అయితే దరఖాస్తు చేసుకోండి..
త్రిఫ్ట్ పథకంలో చేరాలంటే ముందు గా చేనేత జౌళీశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఫారంలో ఇంటి చిరునా మా, పనిచేస్తున్న కార్ఖానా, సాంచా లు, జియోట్యాగ్ చేసిన యూనిక్ నంబర్, నెలకు వస్తున్న వేతనం వివరాలు రాయా లి. ఆధార్‌కార్డు, చేనేత జౌళీశాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు, బ్యాం కు ఖాతా జిరాక్సు పత్రాలు సమర్పించాలి. సాంచాలు, డైయిం గ్, సైజింగ్, వార్పిన్, జాఫర్, భీము లు నింపడం, మాస్టర్, హెల్పర్, టెక్నీషియన్, డిజైనింగ్, వృత్తిలో ఎన్నేండ్ల అనుభవం ఉందో పేర్కొనాలి. ఈ నెల 15నుంచి మే 30 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది.
సద్వినియోగం చేసుకోవాలి..
కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పథకాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. అయితే చేనేత, మరమగ్గాలు జియోట్యాగింగ్ చేసుకున్న కార్మికులకు మాత్రమే స్కీం వర్తిస్తుంది. మే నెలాఖరులోగా కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. కార్మికుడి వాటాగా వేతనంలో 8శాతం బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం మరో 8శాతాన్ని జమచేస్తుంది. ఈ మొత్తం మూడేళ్లలో రెట్టింపవుతుంది.
– సాగర్, ఏడీ చేనేత జౌళీశాఖ (రాజన్న సిరిసిల్ల)