ధర్మపురి, ఏప్రిల్ 18: ధర్మపురి ప్రజల చివరి మజిలీ కష్టాలు తీర్చేందకు ఆధునిక వైకుంఠధామం రెడీ అయింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో రూ.కోటి, టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.40 లక్షలతో ఆధునిక హంగులతో సిద్ధం కాగా మంగళవారం మంత్రి ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే ప్రసిద్ధి గాంచిన ధర్మపురి క్షేత్రంలో దహన సంస్కారాలు, ఆ తదుపరి కార్యక్రమాలు చేసుకునేందుకు ధర్మపురి వాసులే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వస్తూ ఉంటారు. ధర్మపురిలో సరైన వసతులు లేక వచ్చినవారు అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈశ్వర్ ఆధునిక హంగులతో శ్మశానవాటిక నిర్మాణం చేపట్టారు.
గోదావరి ఒడ్డున ఉన్న మహాలక్ష్మీ ఘాట్ వద్ద ఆధునిక హంగులతో.. సకల సౌకర్యాలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. దాదాపు ఎకరం విస్తీర్ణంతో మూడు విశాలమైన దహన వాటికలు.. చితాభస్మం, అస్తికలు భద్ర పరుచుకునేందుకు లాకర్ల సదుపాయం కల్పించారు. సొంత ఇండ్లులేనివారు 12 రోజుల పాటు ఉండేలా అన్ని సౌకర్యాలతో గదులు నిర్మించారు. తాగునీరు, టాయ్లెట్స్, భోజనశాల, పూజామందిరంతో పాటు వాటికి అనుబంధంగా కార్యాలయం, వాచ్మెన్ రూమ్లను కూడా నిర్మించారు. మృతదేహాలను కాల్చివేసే బర్నింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రశాంత వాతావరణం ఉండేలా గార్డెనింగ్, తదితర ఏర్పాట్లు చేశారు. కాగా ధర్మపురి పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి దమ్మన్నపేట బ్రిడ్జి వరకు రూ. 3.50కోట్ల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం మంత్రి ఈశ్వర్ భూమిపూజ చేయనున్నారు..