శంకరపట్నం, ఏప్రిల్ 18: అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. సోమవారం సాయంత్రం మండలంలోని మొలంగూర్ (నల్లవెంకయ్యపల్లె), ఆముదాలపల్లి గ్రామా ల్లో 15 మందికి కల్యాణలక్ష్మి, ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వారి ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బాగా చదివి వృద్ధిలోకి రావాలని విద్యార్థులకు సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఓవర్సీస్ పథకం ద్వారా ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని తెలిపారు. కాగా, స్వయంగా ఎమ్మెల్యే తమ ఇండ్ల వద్దకు వచ్చి చెక్కులను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మొలంగూర్‌లో పూదరి ఓదెలు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. మండల కేంద్రంలో వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం చైర్మన్ సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఫోరం చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బత్తుల మానస, ఎంపీటీసీ మొయిన్, ఉప సర్పంచులు వెంకన్న, జంపయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, విండో చైర్మన్ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 18: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న గ్రామాల అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు.. సర్పంచ్ మీసాల అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, ఉపాధ్యక్షుడు దావు సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామాధ్యక్షుడు గుజ్జుల ప్రణీత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.