హుజూరాబాద్ టౌన్/ జమ్మికుంట రూరల్, ఏప్రిల్ 18: దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళిత బంధు గొప్ప అవకాశమని, లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండ లం విలాసాగర్ గ్రామానికి చెందిన రాచపల్లి అమృతకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను హుజూరాబాద్‌లోని జాన్‌డీర్ షోరూం లో పంపిణీ చేశారు. అలాగే జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారు అంబాల లక్ష్మీరాము జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో డెకరేషన్, సౌండ్స్ షాపును ఏర్పాటు చేసుకోగా, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, వార్డు కౌన్సిలర్ దేశిని సదానందంతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఎస్సీల కోసం రూ.10 లక్షల విలువైన యూనిట్లను పూర్తిగా ఉచితంగా మంజూరు చేస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. లబ్ధిదారులు మంజూరైన యూనిట్లను సక్రమంగా వినియోగించుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ కోడిగూటి శారద- ప్రవీణ్, అంబేదర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.