కార్పొరేషన్, ఫిబ్రవరి 22 : మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే డీపీఆర్ పూర్తి కాగా, సాంకేతిక పనులపై అధికారులు దృష్టి పెట్టారు. మొదటి విడుతలో 2.6 కిలోమీటర్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అలాగే, ప్రాజెక్టుకు ఇప్పటికే మంజూరైన నిధులతో పాటు వచ్చే బడ్జెట్లోనూ మరిన్ని నిధులు మంజూరు చేయించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పనులను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తానికి మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం మంత్రి గంగుల హైదరాబాద్లోని జలసౌధ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలోనే ఈప్రాజెక్టు కోసం రూ.410 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. రాబోయే బడ్జెట్లో సైతం సమర్పించాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్, అప్పర్ ప్రామినాడ్, లోయర్ ప్రామినాడ్ మధ్య నిర్మాణాలకు సంబంధించి సమావేశంలో సమాలోచనలు చేశారు. బోటింగ్, అమ్యూజ్ మెంట్ పారులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, చిల్డ్రన్ పార్స్, కిడ్స్ ప్లే ఏరియాలు, ఆడిటోరియం, మ్యూజియం, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ఫ్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన ల్యాండ్ సేపింగులు, స్పోర్ట్స్ ఎన్ క్లేవ్లో భాగంగా టెన్నిస్, వాలీబాల్, ఇతర స్పోర్ట్స్ కోర్టులు, ప్రాజెక్టు పొడవునా వాకింగ్, జాగింగ్ ట్రాకులను ఏర్పాటు చేయనున్నారు.