కార్పొరేషన్, ఫిబ్రవరి 18: కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 559.78 కోట్లతో అంచనా బడ్జెట్‌ను సిద్ధం చేసింది. వివిధ గ్రాంట్ల ద్వారా ఆదాయం వస్తుందని అంచనా వేయగా వాటి ద్వారా అదే స్థాయిలో అభివృద్ధి పనుల కోసం వ్యయం చేసే దిశగా అంచనాలను సిద్ధం చేశారు. వివిధ గ్రాంట్ల రూపంలో రూ. 460 కోట్ల నిధులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. నగరపాలక సంస్థలో అత్యధికంగా కాంట్రాక్టు కార్మికుల కోసం రూ. 34 కోట్లు, రూ. 6.36 కోట్లు మంచినీటి సరఫరా, అభివృద్ధి పనుల కోసం రూ.400 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీ కింద చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా సాంకేతిక అంశాలను పూర్తిచేసి, పనులను ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై.సునీల్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికనుగుణంగా అధికారులు కసరత్తును ప్రారంభించారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టారు
ఆదాయం ఇలా. .
నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 559 కోట్ల అంచనాతో బడ్జెట్ సిద్ధం చేసింది. దీనిలో రూ. 460 కోట్లు వివిధ పథకాల కింద బల్దియాకు వస్తాయని అంచనా వేశారు. వీటిల్లో ముఖ్యంగా స్మార్ట్‌సిటీ కింద రూ. 392 కోట్లు, పట్టణ ప్రగతి ద్వారా రూ.16 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 16 కోట్లు, సీఎం ఆక్యూరెన్స్ నిధులు రూ. 30 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద రూ. 2 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేశారు. ఆస్తి పన్నుల ద్వారా రూ.41.05 కోట్లు, అడ్వర్టయిజ్మెంట్ బోర్డుల ద్వారా రూ.1.50 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ద్వారా రూ.1.50 కోట్లు, భవన నిర్మాణ అనుమతుల ఫీజుల ద్వారా రూ.35 కోట్లు, నల్లా పన్నుల ద్వారా రూ.6.80 కోట్లు వస్తాయని అంచనా వేశారు.
వ్యయం ఇలా..
నగరపాలక సంస్థ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల కోసం రూ.34 కోట్లు వ్యయం చేస్తుండగా పారిశుధ్య నిర్వహణ కోసం రూ. 11.62 కోట్లు వ్యయం చేయనున్నారు. గ్రీన్ బడ్జెట్ కింద రూ.9.36 కోట్లు కేటాయించారు. హరితహారంలో మొక్కలు నాటడం, సంరక్షణకు వ్యయం చేయనున్నారు. వాహనాల నిర్వహణ కోసం రూ.7 కోట్లు, నర్సరీల పెంపకానికి రూ.2 కోట్లు, మొక్కల సంరక్షణ, ట్రీ గార్డుల కోసం రూ. 3.44 కోట్లు వ్యయం చేశారు. విలీన ప్రాంతాల అభ్యున్నతి కోసం రూ.12.23 కోట్లు, రోడ్డు, మురుగు కాల్వల అభివృద్ధికి రూ. 8.60 కోట్లు, పండుగల నిర్వహణ కోసం రూ. 3 కోట్లు, నగరంలోని వివిధ రోడ్ల అభివృద్ధికి రూ. 4 కోట్లు వ్యయం చేయనున్నారు. వీటితో పాటుగా స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి పనులకు కోసం కేటాయించారు.
భారీగా అభివృద్ధి పనులు..
నగరపాలక సంస్థ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌సిటీ నుంచి రూ.392 కోట్లు వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పట్టణ ప్రగతి, సీఎం ఆక్యూరెన్స్ నిధులు రానుండడంతో అన్ని డివిజన్లలోనూ భారీగా పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో పార్కులు, సుందరీకరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం రూ. 480 కోట్ల నిధులు కేటాయిస్తున్నారు.
నేడు బడ్జెట్. . . సర్వసభ్య సమావేశం
నగర మేయర్ వై.సునీల్‌రావు అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నగరపాలక సంస్థకు చెందిన 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి సర్వసభ్య సమావేశం ఉంటుంది. సమావేశానికి సంబంధించి ఇప్పటికే 77 అంశాలను ఎజెండాలో పొందుపరిచారు. వీటిల్లోనూ పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను చేర్చారు.