వీణవంక, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తం జరుగాలంటే దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరముందని, రాబోయే కాలానికి కేసీఆరే ప్రధానమంత్రి కావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శనం చేసుకున్నానని, వీణవంకలో సమ్మక్క జాతర సందర్భంగా 45 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, ఎమ్మెల్సీ అయ్యాక భక్తుల సౌకర్యార్థం రూ.25 లక్షల నిధులతో అభివృద్ధి చేశామని చెప్పారు. పనులు ఆపేందుకు ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు కుట్రలు చేసినా పూర్తి చేశామని తెలిపారు. అభివృద్ధిపై బండి సంజయ్, ఇద్దరు గుండులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ యాదగిరి గుడి కట్టినట్లు దేశంలో ఎక్కడైనా మోదీ గుడి కట్టించాడా? అని ప్రశ్నించారు. అసలైన హిందూవాది సీఎం కేసీఆర్ అని, అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం గ్రౌండింగ్ కాదని నియోజకవర్గ శాసనసభ్యులు అన్నారని, ఇప్పటికే వెయ్యి యూనిట్లు గ్రౌండింగ్ అయి దళితులు లబ్ధి పొందుతున్నారని, దళిత బంధు పథకం ద్వారా 17,556 మందికి వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని, రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద నియోజకవర్గానికి వంద మంది చొప్పున దళిత బంధు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్‌ను విమర్శించే ముందు ఆలోచన చేయాలని, ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలైతే ముక్కు భూమికి రాస్తానని పేర్కొన్నారు. తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని మోడీ మాట్లాడారని, దానికి సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీ నాయకులు తెలంగాణలో తిరగాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో బుల్లెట్ కొడితే ఎలా దిగుతుందో త్వరలో చూపిస్తానని, త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తానని వెల్లడించారు. ఈటల రాజేందర్ ఎక్కడైతే అభివృద్ధి చేయకుండా ఆపారో అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి చూపిస్తుందని చెప్పారు. తాను తాతల పేర్లు చెప్పుకుంటున్నానని కొందరు అంటున్నారని, 2009 నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కాళ్లపై తాను నిలబడ్డానని స్పష్టం చేశారు. సమ్మక్క-సారలమ్మ సాక్షిగా 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎగిరేది టీఆర్ఎస్ జెండానేనని, సీఎం కేసీఆర్ ఎవరిని సూచించినా వారిని గెలిపించుకుంటామని అన్నారు. సమావేశంలో ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ భానుచందర్, పీఏసీఎస్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు కామిడి శ్రీనివాస్‌రెడ్డి, ఎలవేన మల్లయ్య, సత్యనారాయణ, ఆవాల గిరిబాబు, కిషన్‌రెడ్డి, సురేష్, మహిపాల్‌రెడ్డి, ఊట్ల దేవయ్య, వోరెం మధు, క్రాంతి, యాసిన్, రాజు పాల్గొన్నారు.