గంగాధర, ఫిబ్రవరి 17 : దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పండుగలు నిదర్శనమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మధురానగర్, బూరుగుపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న సమ్మక్క -సారలమ్మ జాతరలో గురువారం స్థానిక నాయకులతో కలిసి అమ్మవారికి బంగారం సమర్పించారు. ఎమ్మెల్యేకు జాతర కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవార్ల గద్దెల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మధురానగర్ సర్పంచ్ వేముల లావణ్య-అంజి దంపతులు ఎమ్మెల్యేను సన్మానించారు. బూరుగుల్లి జాతర ప్రదేశంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో గంగాధర ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, ఆకుల శంకరయ్య, ముక్కెర మల్లేశం, దోర్నాల హన్మంతరెడ్డి, జోగు లక్ష్మీరాజం, వడ్లూరి అనిత, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు తోట మహిపాల్, జారతి సత్తయ్య, రేండ్ల శ్రీనివాస్, నిమ్మనవేణి ప్రభాకర్, వడ్లూరి ఆదిమల్లు, దోమకొండ మల్లయ్య, వినోద్ పాల్గొన్నారు.
వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర
మండలంలోని మైలారం , గన్నేరువరం గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లను భక్తులు దర్శించుకొంటున్నారు. జాతర కమిటీ సభ్యులు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎస్ఐ మామిడాల సురేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మానేరు బ్యాక్ వాటర్‌లో భక్తులు స్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొన్నారు. అమ్మవార్లు గద్దెల పైకి రావడంతో భక్తుల పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.
గద్దెల వద్దకు తరలిన సమ్మక్క
కేశవపట్నం, గద్దపాక, ఆముదాలపల్లిలో సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. కేశవపట్నంలో గురువారం రాత్రి సమ్మక్కను గద్దెలపైకి తరలించడంతో భక్తుల మొక్కులు ప్రారంభమయ్యాయి. మేడారం కోయ పూజారి ఆధ్వర్యంలో స్థానిక పూజారులు గొడిశాల ఎల్లయ్య, జనగాం తిరుపతి, కొత్తపెల్లి రాజయ్య, జాతర కమిటీ సభ్యులు వెంకయ్య గుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి సమ్మక్కను గద్దెల వద్దకు తరలించారు. కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాల నడుమ అమ్మవారిని ఊరేగించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో వైద్య సదుపాయాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తులు వన దేవతలకు ఎత్తు బంగారం, ఎదుర్కోళ్లు సమర్పించారు. కేశ ఖండనం వద్ద భక్తుల రద్దీ నెలకొంది.
గద్దెలపైకి వన దేవతలు
మండలంలోని నల్లగొండ, కొత్తపల్లి, రామకృష్ణకాలనీ, వచ్చునూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న జాతరకు గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సారలమ్మ గద్దెలపైకి రాగా.. గురువారం సాయంత్రం సమ్మక్కను కోయ పూజారులు గద్దెలపైకి తీసుకువచ్చారు. భక్తులు ఎత్తుబంగారం సమర్పించుకున్నారు.