కమాన్‌చౌరస్తా/గంగాధర/ఇల్లందకుంట, ఫిబ్రవరి 17 : సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా రెండో రోజు గురువారం సమ్మక్క తల్లి గద్దె పైకి చేరుకుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేగుర్తి, శంకరపట్నం, వీణవంకతోపాటు పలు చోట్ల సమ్మక్క సారలమ్మ జాతరలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలకు చేరుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ గౌడ్, రాజశేఖర్, జాతర చైర్మన్ పిట్టల శ్రీనివాస్, రేకుర్తి జాతర ఈవో రత్నాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కోయపూజారులు డప్పు చప్పుళ్లతో గుట్టలో ఉన్న సమ్మక్కను తీసుకురావడానికి బయలుదేరారు. అనంతరం అంగరంగ వైభవంగా 6 గంటల సమయంలో అమ్మవారు గద్దెపైకి వస్తున్న క్రమంలో భక్తులు ఎదురు కోళ్లు, పొర్లు దండాలు సమర్పించారు. అమ్మవారిని ప్రతిష్ఠించే సమయంలో ఆలయ పరిసరాలు భక్తుల పూనకాలతో పరవశించిపోయాయి.
అయితే, రెండో రోజు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ఇక్కడికి చేరుకున్నారు. సాయంత్రం సమయంలో రేకుర్తి ప్రాంతం జనసంద్రంగా మారింది. రాత్రి వరకు దాదాపు లక్ష వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే, సీఎం జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో అమ్మవారికి 68 కిలోల బంగారం మొక్కుగా చెల్లించారు.
చింతకుంట వద్ద నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించారు. సాయంత్రం కోయ పూజారులు సమ్మక్కను తీసుకురాగా, ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసి పోయింది. ఇక్కడ ఆలయ ఈవో అనిల్, ఎంపీటీసీ సభ్యుడు తిరుపతి నాయక్, సర్పంచ్ సమ్మయ్య, నిర్వాహకుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పటిష్ఠంగా పోలీసులు, వలంటీర్ల సేవలు..
రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద పోలీసులు, సాన్వి కళాశాల వలంటీర్లు పటిష్ఠంగా బందోబస్తు నిర్వహించారు. సమ్మక్క గద్దెల వద్దకు వస్తున్న క్రమంలో ఎస్ఐ ఎల్లా గౌడ్ ఆధ్వర్యంలో రోప్ బృందం ముందు రాగా, కోయ పూజారులు అమ్మవారిని తీసుకువచ్చారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు సాన్వీ కళాశాల విద్యార్థులు సేవలందించారు. పలు సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు నీటి ప్యాకెట్లు అందజేశారు. గంగాధర మండలంలోని మధురానగర్, బూరుగుపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న జాతరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎత్తు బంగారం సమర్పించారు. ఇల్లందకుంట మండలంలోని వాగొడ్డురామన్నపల్లిలో జరుగుతున్న జాతరలో టీఆర్ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, ఎంపీపీ పావని పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.