సైదాపూర్, ఫిబ్రవరి 10 : వెన్నంపల్లి అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సమైక్య రాష్ట్రంలో కనీస వసతులు లేక.. పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడ్డ గ్రామం, స్వరాష్ట్రంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు కృషి, పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులతో అద్దంలా తయారైంది. అనేక వసతులను సమకూర్చుకున్నది. ఇంకా చెత్త నుంచి ఎరువును తయారు చేస్తూ విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం, సంసద్ ఆదర్శ్ యోజనలో దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
2014లో దత్తత..
వెన్నంపల్లి పెద్ద గ్రామమే. గ్రామంలో 534 ఇండ్లు ఉండగా, 2167 మంది ప్రజలు ఉన్నారు. గ్రామం ఒకప్పుడు అనేక సమస్యలతో సతమతమయ్యేది. ఈ క్రమంలో స్వరాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో గ్రామానికి మంచిరోజులు వచ్చాయి. సమస్యలు ఒక్కొక్కటిగా దూరంకావడం మొదలైంది. ఈ క్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు 2014-15లో గ్రామాన్ని సంసద్ ఆదర్శ్‌గ్రామ్ యోజన కింద దత్తత తీసుకున్నారు. ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు గ్రామంలో సీసీరోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు.
పల్లె ప్రగతిలో ముందంజ
ఎంపీ కెప్టెన్ చేస్తున్న అభివృద్ధికి తోడు రాష్ట్ర సర్కారు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామానికి కావల్సిన వసతులన్నీ సమకూరాయి. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలతోపాటు పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్, నర్సరీ ఏర్పాటు చేశారు. గ్రామంలోని చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తూ స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నారు. ఇవేకాదు సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్‌రెడ్డి, పాలవర్గం సమష్టి కృషితో అతి తక్కువ టైంలోనే గ్రామ చిత్రమే మారిపోయి అద్దంలా తయారైంది. ఇంకా చెత్త నుంచి ఎరువునూ తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తూ పంచాయతీకి అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంసద్ యోజనలో దేశంలోని అన్ని గ్రామాలను వెనక్కి నెట్టి 90.25 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
చాలా సంతోషంగా ఉన్నది
వెన్నంపల్లిని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు దత్తత తీసుకొని అనేక పనులు చేయించారు. ఇంకా రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి, పల్లె ప్రగతి పనులతో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించుకున్నం. అన్ని వసతులు సమకూర్చుకున్నం. దేశంలోనే మొదటి స్థానంలో నిలువడం సంతోషంగా ఉంది. ఎంపీ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్, జడ్పీవైస్ చైర్మన్ పేరాల గోపాలరావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– అబ్బిడి పద్మరవీందర్రెడ్డి, సర్పంచ్ (వెన్నంపల్లి)