విద్యానగర్, ఫిబ్రవరి 10 : ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు అందిస్తున్న కేంద్రాలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్, 2018లో లక్ష్య కార్యక్ర మాలను చేపట్టింది. వీటి కింద ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలు పీహెచ్‌సీలు ఎంపిక య్యాయి. లక్ష్య కార్యక్రమాన్ని ప్రారంభించిన 2018-19లోనే జిల్లాలోని చల్లూరు, గంగాధర, శంకరపట్నం పీహెచ్‌సీలు ఎంపికయ్యాయి. 2020-21లో కరీంనగర్‌లోని బుట్టిరాజారాం కాలనీ యూహెచ్‌సీ ఎంపికైంది. 2021-22 సం వత్సరానికి కరీంనగర్‌లోని ఎంసీహెచ్, పెద్దపల్లి జిల్లా లక్ష్మీపురం యూపీహెచ్సీ, రామడుగు పీహెచ్‌సీని ఎంపిక చేసినట్టు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రకటించింది. ఎంసీహెచ్, ఆయా పీహెచ్‌సీల పనితీరును గతేడాది డిసెంబర్ 10, 11 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ వైద్య బృందం పరిశీ లించింది. ఈ బృందం ఇచ్చిన మార్కుల(100కు కనీసం 75) ఆధారంగా లక్ష్య కోసం ఎంపిక చేస్తారు. కాగా, కరీంనగర్ ఎంసీహెచ్‌లోని లేబర్ రూంకి 89, ఆపరేషన్ థియేటర్‌కు 83 మార్కులు వచ్చాయి. దీంతో దీనిని లక్ష్య కోసం ఎంపిక చేశారు. ఈ కేంద్రానికి మూడేళ్ల పాటు రూ.6 లక్షల చొప్పున లక్ష్య నుంచి నిధులు కేటాయిస్తా రు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఈ కేంద్రంలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరు గుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులను కా ర్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఖర్చు చేయనున్నారు. కాగా, పెద్దపల్లి జిల్లా లక్ష్మీపురం యూపీహెచ్సీకి 86.8, రామడుగు ప్రాథమిక ఆ రోగ్య కేంద్రానికి 76.87 మార్కులు రావడంతో నేషనల్ క్వాలిటీ అస్స్యూరెన్స్ స్టాండర్డ్స్ కార్యక్ర మం కింద ఎంపికయ్యాయి. వీటికి మూడేళ్లపాటు ఏటా రూ.3 లక్షల చొప్పున కేంద్ర నుంచి రాను న్నాయి. ఇక్కడ కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులను ఖర్చు చేస్తారు.
వైద్యసేవల్లో రామడుగు పీహెచ్సీ భేష్
రామడుగు మండల కేంద్రంలోని పీహెచ్సీ రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు దవాఖాన ఆవరణ రోగులకు అనుకూలంగా, పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు గుర్తింపు దక్కింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ ప్రకారం కేంద్ర ఆరోగ్యశాఖ బృందం నివేదికలో 76.87 మార్కులు వచ్చినట్లు వైద్యాధికారి శ్రీని వాస్ తెలిపారు. ఇక్కడ ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు, రక్త పరీక్షల తర్వాత పడేసే సిరంజీలు, తదితర నిరుపయోగ వస్తువులను ఏరోజుకారోజు కరీంనగర్‌లోని డంపింగ్‌కు తరలించి పరిశుభ్రం గా ఉంచుతున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 40 నుంచి 50 మంది వరకు రోగులు వస్తున్నారు. ఒక వైద్యుడు, ఒక సీహెచ్‌వో, ముగ్గురు సూపర్వైజర్లు, 10 మంది ఏఎన్ఎంలు, 21 మంది ఆశ కార్యకర్తలు, నేచురోపతి వైద్యాధికారి, ఇద్దరు అటెండర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ పీహెచ్సీ అద్దెగదిలో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భవనం నిర్మించింది. ప్రస్తుత వైద్యాధికారి శ్రీనివాస్‌తో పాటు గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన వైద్యురాలు నవీన దవాఖాన ఆవరణను ప్రకృతి వైద్యశాలగా తీర్చిదిద్దడంలో చాలా కృషి చేశారు. సుమారు 600కు పైగా అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రకృతి పరవశించే విధంగా దవాఖాన ఆవరణ అందంగా కనబడుతుంది.
సేవలో మిన్న ఎంసీహెచ్
కరీంనగర్‌లోని మాతా, శిశు ఆరోగ్య కేం ద్రం(ఎంసీహెచ్) వైద్య సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలోనే మొదటిసారి మిడ్వైఫరీ ట్రైనింగ్‌ను కేంద్రాన్ని కరీంనగర్ జిల్లాకు కేటాయించగా వైద్యులు, సిబ్బంది సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించడంతో ఇక్కడ రోజురోజుకూ సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. ఎంసీహెచ్‌లో నెలకు 600 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 150 మంది కొవిడ్‌తో బాధపడ్డ గర్భిణులకు కాన్పులు చేశారు. వైద్యులు, సిబ్బంది ఐక్యతతోనే రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నది.
లక్ష్య కోసం ఎంతో శ్రమించాం
కేంద్రం ప్రతిపాదించిన లక్ష్యాలన్నింటినీ చేరుకున్నాం. మాతా శిశు ఆరోగ్యంతోపాటు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యాన్ని అందించాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశం. దీనికి ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్, లేబర్ రూంలను వివిధ రకాలుగా పరీక్షించి మార్కులను కేటాయిస్తారు. ఈ కార్యక్రమం కింద ఏడాదికి రూ.6 లక్షలు రావడం వల్ల దవాఖానను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది.
– డాక్టర్ అలీం, ఏవో (ఎంసీహెచ్ )
సమష్టి కృషితోనే సాధ్యమైంది
దవాఖానలోని ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచాలన్నదే మా లక్ష్యం. ‘లక్ష్య’ కింద ఒక లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్‌కే పరిమితం కాకుండా దవాఖానలోని వార్డులు, ఓపీ రూంలు, ల్యాబ్‌లు, ఫార్మసీ, ఐసీయూ, ఎస్ఎన్సీయూలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నాం. లక్ష్యకు ఎంపిక కావడానికి సమష్టి కృషే కారణం.
– జనగామ సులోచన, నర్సింగ్, సూపరింటెండెంట్
మరింత అభివృద్ధి చేయొచ్చు
లక్ష్య కార్యక్రమం కింద ఎంసీహెచ్, ఎన్‌క్యూఏఎస్‌కు రామడుగు పీహెచ్సీ, లక్ష్మీపురం యూపీహెచ్సీ ఎంపిక కావడం శుభ పరిణామం. ఈ సెంటర్లకు కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయిస్తుంది. మరిన్ని సెంటర్లు ఎంపిక కావడానికి శ్రమిస్తున్నాం.
– టీ సాగర్, జిల్లా క్వాలిటీ మేనేజర్
నాణ్యతా ప్రమాణాల్లో లక్ష్మీపురం టాప్
నాణ్యతా ప్రమాణాల్లో లక్ష్మీపురం యూపీహెచ్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో ఆదర్శంగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్‌కు 86.8శాతం మార్కులు సాధించగా, ఈ సెంటర్ డాక్టర్ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను 25 శాతం సిబ్బందికి, 75 శాతం దవాఖాన అభివృద్ధికి కేటాయించనున్నారు. కాగా, ఈ కేంద్రం 2015లో కేంద్ర ప్రభుత్వ కాయకల్పకు ఎంపికవడంతో అప్పుడు రెండేళ్ల పాటు రూ.2లక్షల చొప్పున నగదు వచ్చింది.