కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 6: జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. 14 మంది ఫైనలియర్ విద్యార్థులు మల్టీ నేషనల్ సంస్థ అయిన టీసీఎల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆ సంస్థ అక్టోబర్ నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టింది. కళాశాలకు చెందిన డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కళాశాల చైర్మన్ వీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. టీసీఎస్ నిర్వహించిన నాలుగు రకాల పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో చైర్మన్ రవీందర్రెడ్డి ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. మహిళా విద్యను ప్రోత్సహించేందుకే తాను విద్యాసంస్థను స్థాపించినట్లు చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే భావిభారతం అభివృద్ధి వైపు కదులుతుందని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని, వారికి నచ్చిన రంగంలో ఉద్యోగం చేసేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులు కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని వివరించారు.
విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తాం
కళాశాలలో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నాం. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే మా లక్ష్యం. కళాశాలలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. కళాశాల నుంచి 14మంది ఒకే సంస్థలో ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది.
– వీ రవీందర్రెడ్డి, కళాశాల చైర్మన్