కోల్‌సిటీ, అక్టోబర్ 18: కడదాకా తోడుండాల్సిన భర్త అర్ధంతరంగా తనువుచాలించాడు. ఆదరించాల్సిన బంధువుల నుంచి చిన్నచూపు దిక్కయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యమనుకున్నది. కానీ, ఇద్దరి కొడుకులను చూసి వెనుకడుగు వేసింది. వారికి గొప్ప భవిష్యత్‌ను ఇవ్వాలని నిర్ణయించుకుని తనకిష్టమైన నటనా రంగంలోకి అడుగుపెట్టింది. అనేక లఘుచిత్రాల్లో నటించి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది విజయలక్ష్మి. గోదావరిఖనిలోని తిలక్‌నగర్‌కు చెందిన ఆమెకు అదే కాలనీకి చెందిన కాసం కుమార్‌తో ఇరువై నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. భర్త రెండేండ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇద్దరి బిడ్డల పోషణ భారం మీద పడడంతో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నది. కానీ, ఎలాగైనా నిలదొక్కుకోవాలని తలంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి కరీంనగర్‌కు చేరకున్నది. తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన నటనా రంగంలోకి అడుగుపెట్టింది. షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటిస్తూ తన ప్రతిభను చాటింది. ఇప్పటివరకు దాదాపు 80 వరకు లఘు చిత్రాల్లో నటించింది. సందేశాత్మకమైన చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నది. భవిష్యత్‌లో మరింతగా ఎదిగి సమాజంలో తానేంటో నిరూపించుకుంటానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నది.