విద్యానగర్, అక్టోబర్ 11: కరీంనగర్‌లోని మెడికవర్ దవాఖానలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలందిస్తున్నట్లు మెడికవర్ గ్రూప్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ తెలిపారు. నగరంలోని మెడికవర్ దవాఖానలో సూపర్ స్పెషాలిటీ సర్జరీల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, అత్యాధునిక ఐసీయూ విభాగాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, మెడికవర్ గ్రూప్ 14 దేశాల్లో 250కి పైగా దవాఖానలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో 24 దవాఖానల్లో వైద్య సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా కరీంనగర్లో వైద్య సేవలందించాలనే సంకల్పంతో ఇక్కడి దవాఖానలో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి వైద్యం అందించేందుకు ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఎలాంటి వైద్యం లభిస్తుందో కరీంనగర్ మెడికవర్‌లో కూడా ఆ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల క్రితం వరకు గుండె శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు కరీంనగర్‌లోని మెడికవర్‌లో గుండె శస్త్ర చికిత్స చేసి ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ గ్రూప్ ఆఫ్ సీఈవో జాన్ స్టబ్బింగ్స్టన్, సీఎఫ్‌వో జోర్యన్, క్లస్టర్ హెడ్ మేఘా, కరీంనగర్ దవాఖాన హెడ్ కిరణ్, వైద్యులు సదాశివత్ తమగొండ, కొండపాక కిరణ్, శ్వేత, సాయిఫణిచంద్ర, అనిల్‌కుమార్, వినయ్, ప్రత్యూష, యుగేందర్, మహేశ్, నాగరాజు, కార్తీక్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.