ధర్మపురి, అక్టోబర్ 2: ధర్మపురి దవాఖానకు మహర్దశ పట్టింది. 30 పడకల హాస్పిటల్‌కు అదనపు హంగులు, సౌకర్యాలు చేకూరనున్నాయి. రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో ధర్మపురి ప్రభుత్వ దవాఖాన 30పడకల ఆసుపత్రి నుంచి విస్తృత సేవలు అందించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ ఆధీనంలోకి చేర్చబడింది. ఇకనుంచి ఈవైద్యశాలలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ మేరకు 9 మంది వైద్యులను కూడా డిప్యూటేషన్‌పై నియమించారు. ఈదవాఖానకు ప్రతిరో జూ వందలాది మంది రోగులు వస్తుంటారు. ధర్మపురి మండలంతోపాటు బుగ్గారం మండలం నుం చి పేషెంట్లు వస్తూ ఉంటారు. రోజూ సుమా రు 200 మంది ఔట్ పేషెంట్లు, దాదాపు10 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతూ ఉంటారు.
వైద్యవిధాన పరిషత్ ఆధీనంలోకి మార్చబడిన ధర్మపురి దవాఖానలో విధులు నిర్వహించేందుకు గాను 9 మంది వైద్య నిపుణులను డిప్యూటేషన్‌పై నియమించారు. అందులో ఎముకల వైద్య నిపుణులుగా డా.నవీన్, స్త్రీ వైద్య నిపుణులుగా డా. శిరీష, జనరల్ సర్జన్ డా.హరికిరణ్, మత్తు)వైద్యు లు డా.శ్రీకాంత్, పిల్లల వైద్య నిపుణులు డా. మానస, చర్మవైద్య నిపుణులు డా.సుమన్, ఊపిరితిత్తుల నిపుణులు డా.రాజ్‌కుమార్, కంటి వైద్యనిపుణులు డా.ఝాన్సీ, సాధారణ వైద్యులు డా.శిరీషబేగం విధుల్లో చేరనున్నారు. అలాగే శవపరీక్షలు, మెడికల్ లీగల్ కేసులు కూడా ఇక్కడ జరుగనున్నాయి.
ధర్మపురి ప్రభుత్వ దవాఖాన పేదలకు వరంలా మారనున్నది. హాస్పిటల్‌ను వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి చేర్పించాం. ఆ మేరకు విభాగాలను ఏర్పాటు చేసి అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందించనున్నాం. దవాఖానలో సివిల్ సర్జన్లు, స్త్రీ వైద్య నిపుణులు, మత్తుమందు వైద్యులు, పిల్లల వైద్యులు, కీళ్లు ఎముకలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉంటారు. వైద్యవిధాన పరిషత్ ఆధీనంలో నిర్వహించే దవాఖానకు ఆర్థిక కేటాయింపులు కూడా పెరుగనున్నాయి. వైద్యశాలలో ప్రధాన, చిన్న పరికరాల సదుపాయం, నిర్వహణ, పర్యవేక్షణ, పారిశుధ్యం వీటన్నింటిపై దృష్టి ఉంటుంది. ధర్మపురిలో 50 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రం కూడా కొద్ది రోజుల్లో పూర్తి కానున్నది.