కార్పొరేషన్/గంగాధర/మానకొండూర్/ తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 23: బతుకమ్మ చీరల పంపిణీ పండుగలా సాగుతున్నది. గురువారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంపిణీకి శ్రీకారం చుట్టగా, రెండో రోజూ సందడిగా సాగింది. శుక్రవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని రాంనగర్ మహిళా సంఘ భవనంలో 16,37,38వ డివిజన్ మహిళలకు మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ చీరలను అందజేశారు. మానకొండూర్ రైతువేదికలో, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో, గన్నేరువరం రైతు వేదికలో, ఇల్లంతకుంటలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చీరలు పంపిణీ చేశారు. వేములవాడ మహాలింగేశ్వర గార్డెన్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్, గోదావరిఖని విశ్వం ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మహిళలకు చీరలు అందజేశారు. ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధులు పంపిణీ చేయగా, అంతటా మహిళలు చీరలను సంబురంగా అందుకొన్నారు.
కేంద్రం కక్ష సాధింపు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేని కేంద్రం కక్ష్య సాధింపు ధోరణికి పాల్పడుతున్నది. రాష్ర్టాన్ని అన్నింటా అగ్రగామిగా నిలుపుతున్న సీఎం కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. విద్య, వైద్యం సాగు, తాగునీరు లాంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. రాష్ట్రంలో 45లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తాం. మంత్రి కేటీఆర్ సారథ్యంలో వేములవాడ అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇటీవలే 14కోట్ల నిధులు కూడా మంజూరుచేశాం.
-వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి చూపాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీకి సంకల్పించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా రెండు వర్గాలకు మేలు చేసేలా రూపొందించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో నిరుపేద మహిళలు సైతం బతుకమ్మ పండుగకు కొత్త చీర కట్టుకొని మురిసిపోతున్నారు. పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. బతుకమ్మ పండుగను ఉద్యమ ప్రేరణకు ఉపయోగించుకున్నారని మహిళల స్ఫూర్తిని అభినందించారు.
– గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రెండోసారి చీర అందుకున్న
రాష్ట్రంలో రెండోసారి బతుకమ్మ చీరను అందుకున్న. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకొనేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం గొప్ప విషయం. చీరల పంపిణీ బహుషా ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో తప్ప మరోచోట లేదు కావచ్చు. రాష్ట్రంలోని మహిళలను తోబుట్టువుల్లా చూసుకుంటూ వారి సంతోషమే తమ సంతోషంగా భావించే కేసీఆర్ సారు నిజంగా ధన్యజీవి.
– బండారి గాయత్రి, హిమ్మత్‌నగర్ (గంగాధర)
10 రోజుల ముందే వచ్చినయ్
బతుకమ్మ పండుగకు 10 రోజుల ముందే చీరలు వచ్చినయ్. టీఆర్ఎస్ సర్కారు వచ్చినంక బతుకమ్మ పండుగకు ఏటా మహిళలకు కానుకగా కేసీఆర్ సార్ చీర పంపుతున్నడు. ఇప్పుడు వచ్చిన చీరల రంగులు బాగున్నాయి. చిన్న బతుకమ్మ పండుగ రోజున కేసీఆర్ సార్ ఇచ్చిన చీర కట్టుకుని బతుకమ్మ ఆడుత. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
-మొల్గురి స్వప్న, గర్రెపల్లి (సుల్తానాబాద్ రూరల్)
చీరలు మంచిగున్నయి
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు పంపించిన చీరలు సూపరున్నయి. మునుపటి కంటే మంచిగున్నయి. రంగులు, డిజైన్లను సూత్తె సంబురమైతంది. గిన్ని రంగుల్లో ఏది తీసుకోవాల్నో అర్థమైతలేదు. చీరలు ఇత్తున్న కేసీఆర్ సారు సల్లగుండాలె.
-జాన తిరుపత్మ, గర్రెపల్లి(సుల్తానాబాద్ రూరల్)
చీరలు బాగున్నాయి
బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చీరెలు చాలా బాగున్నాయి. తీరొక్క రంగులు, డిజైన్లతో చూడ సక్కగున్నయ్. ఏటా పండుగకు సర్కారు కొత్త చీరలను అందివ్వడం చాలా సంతోషంగా ఉంది.
-వనపర్తి లక్ష్మి, వేములవాడ
సంతోషంగా జరుపుకోవాలనే..
బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ ఏటా చీరలను పంపిణీ చేస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టలేదు. పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు.
-సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
ఆడబిడ్డకు అందిస్తున్న సారె
ఆడబిడ్డకు పండుగకు సారెలెక్క ఏటేటా బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ చీర ఇస్తున్నడు. పండుగకు పిలిచి చీరెను ఇవ్వడం ఎంతో సంతోషంగ ఉంది. ఈ సారి చీరలు మంచిగున్నయి.
-గోస్కుల కనకలక్ష్మి, వేములవాడ
పండుగ పూట చీర అచ్చింది.
తెలంగాణల పెద్ద పండుగ బతుకమ్మ. ఈ పండుగచ్చిందంటె ఆడోళ్లకు మస్తు సంబురమైతది. పండుగకు కేసీఆర్ సారు మరిసిపోకుండా చీర పంపిండు. మా ఊరికి గూడ చీరలు అచ్చినయ్ అని దెల్వడంతో సంబురమైంది. తీరొక్క రంగులతో చీరలు సక్కగున్నయి. ఆడబిడ్డలకు చీర పంపిన కేసీఆర్‌ను ఎప్పటికీ యాదికి ఉంచుకుంటం.
-దుబాసి లచ్చమ్మ, గర్రెపల్లి (సుల్తానాబాద్ రూరల్)
ఆత్మగౌరవ పండుగ
తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ. ఉమ్మడి రాష్ట్రంలో పండుగలు ప్రాభవం కోల్పోయాయి. నాడు బతుకమ్మ పండుగను అదేం పండుగ అని కూడా హేళన చేశారు. స్వరాష్ట్రంలో పండుగలకు పూర్వ వైభవం వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి మహిళ సంతోషంగా పండుగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఏటా బతుకమ్మ చీరలను అందజేస్తున్నారు. ఈ చీరల తయారీతో చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్త్తూ చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
గంగాధర మండలం కురిక్యాలలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఆడబిడ్డలకు భరోసా
తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు భరోసానిస్తున్నది. పుట్టిన పసిపాప నుంచి పండు ముసలి వరకు వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నది. ఆడబిడ్డలకు పండుగకు చీర పెట్టాలనే సంప్రదాయం తెలంగాణలో ఉంది. అందుకే సీఎం కేసీఆర్ కుల మతాలకతీతంగా ఆడబిడ్డలకు ఏటా చీరెలు పంపిణీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇలాంటి అద్భుత పథకాలను నీరుగార్చేందుకు ప్రతిపక్ష పార్టీలు అసత్యపు ఆరోపణలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి.
– ఇల్లంతకుంట, మానకొండూర్, ఎల్ఎండీ, గన్నేరువరంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్