ధర్మారం, సెప్టెంబర్ 19 : స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని, వారంతా సమాజంలో గౌరవ ప్రదంగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేం ద్రంలో సోమవారం ఆయన పర్యటించారు.
కొత్తగా పింఛన్ మంజూరైన 1783 మంది లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పత్రాలు, ఐడీ కార్డులను ఎంపీపీ ముత్యా ల కరుణశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చేయడం సిగ్గు చేటని మంత్రి మండిపడ్డారు.
సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం నరేంద్ర మోదీ పాలనలో పేదలకు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. అలాంటి పార్టీలు పనిగట్టుకొని తమ ఉనికి కోసం ప్రభుత్వంపై విమర్శ లు చేయడం అర్థరహితమని దుయ్యబట్టారు. సంక్షేమ ప థకాలపై కేంద్ర ప్రభుత్వం ఉచితాలు ఇవ్వవద్దంటూ వి మర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వారిని పట్టించుకోని సీఎం కేసీఆర్ పేదల సం క్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్నారని, అందులో భాగంగానే పింఛన్ వయో పరిమితిని 57కు తగ్గించి 10 లక్షల కొత్త పింఛన్లు మం జూరు చేశారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
ఈ పింఛన్లతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలకు చేరిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ, కాం గ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. ధరణితో నష్టం జరుగుతున్నదని, దానిని రద్దు చేస్తామని అంటున్న కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరిలో ఏడాదంతా సుమారు 250 కిలో మీటర్ల మేర నీటి నిల్వలు ఉంటున్నాయని, తద్వారా మత్స్యకారులు చేపలు పెంచుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం కోసం రుణమాఫీతో పాటు రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేసి అండగా ఉంటున్నామని వివరించారు. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాకో మెడికల్ కళాశాల, మాతా శిశు సంరక్షణా కేంద్రం, సమీకృత జిల్లా కలెక్టరేట్లు ఏర్పాటయ్యాయని మంత్రి ఈశ్వర్ వెల్లడించారు. పల్లె ప్రగతితో గ్రామాల ముఖ చిత్రాలు మారాయని, ఇది ఎంతో శుభ పరిమాణమని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఎంపీడీవో జయశీల, సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫీ, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు పూస్కూరు రామారావు, మండల కో ఆర్డినేటర్ పాకాల రాజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సర్పంచులు, ఎంపీటీసీలు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.