తన పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఈ యేడు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ట్యాబ్స్ అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గత జూలై 24న ప్రకటించిన అమాత్యుడు, వాటిని వారం రోజుల్లో అందజేస్తానని తాజాగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘నా హామీ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. వారంలో అందిస్తా.. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉన్నది’ అంటూ సోమవారం పోస్ట్ చేయగా, విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, ట్యాబ్స్తోపాటు స్టడీ మెటీరియల్ అందించబోతుండగా, సిరిసిల్ల జిల్లాలో 3900 మందికి ప్రయోజనం కలుగనున్నది.
సిరిసిల్ల, సెప్టెంబర్ 19: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన పుట్టిన రోజున ప్రతి సంవత్సరం పేదలకు మంత్రి కేటీఆర్ సాయం చేస్తున్నారు. మూడేండ్ల క్రితం జిల్లా దవాఖానకు ఆరు అంబులెన్స్‌లు అందించిన మంత్రి, గతేడాది 200కు పైగా త్రిచక్రవాహనాలు అందించి తన సేవా స్ఫూర్తిని చాటారు. గడిచిన తన బర్త్‌డే (జూలై 24) సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ట్యాబ్‌లు, కోచింగ్ మెటీరియల్ అందిస్తానని ప్రకటించారు. ఏదో రకంగా సాయం అందిస్తున్న మంత్రి కేటీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
అయితే, వాటిని వారం రోజుల్లోగా అందిస్తానని ప్రకటించారు. ‘నా హామీ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. వారంలో అందిస్తా.. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని తాజాగా ట్విట్టర్లో పోస్టు చేశారు. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 3,900 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో ప్రథమ సంవత్సరంలో 1,920 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,980 మంది విద్యనభ్యసిస్తున్నారు. అమాత్యుడి నిర్ణయంతో వీరందరికీ ట్యాబ్‌లు అందనున్నాయి. కాగా, వీటితోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు స్టడీ మెటీరియల్ అందించాలని భావిస్తున్నారు.
మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు..
మంత్రి కేటీఆర్ పెద్దమనసుతో ట్యాబ్స్ అందించడం సంతోషకరం. ఇవి విద్యార్థులకు ఎంతగానో దోహదపడనున్నాయి. పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందుకు ట్యాబ్స్‌తో పాటు కోచింగ్ మెటీరియల్ అందించడం విద్యార్థుల్లో మరింత ఆనందాన్ని నింపుతున్నది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న అమాత్యుడికి కళాశాలల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– సీహెచ్ మోహన్, డీఐఈవో సిరిసిల్ల