తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ ప్రగతి ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. ఆటపాటలు అభినయంతో ఆహుతులను అలరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, సిరిసిల్లలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు వేడుకల్లో పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 18 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం వైభవం గా జరిగాయి. సాయంత్రం జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫూలే మైదానంలో (సరస్ గ్రౌండ్ )లో సబ్బండవర్గాలు అబ్బురపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా, సమైక్యతా భావం పరిఢవిల్లేలా విద్యార్థులు చేసిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. శాస్త్రీ య నృత్యం, కోలాటం, చిందు బాగోతం, యక్షగానం, ఒగ్గు కథ, దేశభక్తి గేయాలు, నాటికలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేకార్షణగా నిలిచాయి.తెలంగాణవీరుల పోరాటస్ఫూర్తిని తెలంగా ణ సాంసృతిక సారథి బృందం కళాకారులు తమ ప్రదర్శనలతో ధూంధాం చేశారు. నగ రవాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చి వేడుకలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరవగా, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నగర మేయర్ వై సునీల్ రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడాచైర్మన్ రామకృష్ణారావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్, ఆర్డీవో ఆనంద్ కుమార్, కలెక్టరేట్ ఏవో డాక్టర్ నారాయణ పాల్గొన్నారు.
1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమై 75వ సంవత్సరంలోకి అడుగిడిన శుభతరుణాన్ని పురసరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా కళలను గౌరవించుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడం ప్రభుత్వం వారికిస్తున్న గౌరవానికి నిదర్శనం. సంస్కృతీ, సంప్రదాయాలకు తెలంగాణ నిలయం.
– వజ్రోత్సవాల్లో మంత్రి గంగుల కమలాకర్
విమోచనం పేరిట మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న శక్తులను తరిమికొట్టేందుకు ప్రతిపౌరుడూ సిద్ధం కావాలి. దేశంలోని అన్ని సంస్థానాల మాదిరిగానే తెలంగాణ భారత యూనియన్‌లో చేరింది. కానీ, కొందరు ఈ చారిత్రక ఘట్టాన్ని మతాల మధ్య పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరించేందుకు కుతంత్రాలు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి పార్టీలపై అప్రమత్తంగా ఉండాలి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తున్నది. ఇలాంటి తరుణంలో ఆయనకు అండగా నిలువాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.