చిగురుమామిడి, సెప్టెంబర్ 18: వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టితో శతాబ్దాల తరబడి మండలంలో సరైన పంటలు పండక రైతులు తల్లడిల్లిపోయారు. మండల ప్రజలు, రైతులు సాగు, తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. ఇది గతం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరువు ప్రాంతమైన చిగురుమామిడి మండలంలో రైతుల భూములు సస్యశ్యామలమయ్యాయి. ఆరుతడి పంటల సాగుకు సైతం నానా కష్టాలు పడ్డ రైతులు నేడు వరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ కృషితో హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందాయి. తోటపల్లి రిజర్వాయర్ నుంచి గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించడంతో మండలంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
గోదావరి జలాలతో మూడు సంవత్సరాలుగా మండలంలోని ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. ఆరుతడి పంటలైన పత్తి, మక్కజొన్న, పల్లి ఇతర వాణిజ్య పంటల సాగు తగ్గించి, బీళ్లుగా ఉన్న భూములను అన్ని రకాల పంటల సాగుకు అనువుగా మార్చుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి పోయాయి. గత వానకాలంలో 16.85 వేల ఎకరాల వరి సాగు చేయగా, ప్రస్తుతం 20.304 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంతో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వ్యవసాయ బావులు నిండుకుండలా మారడంతో రైతులు సైతం వరి సాగు వైపే ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి పంటల పనితీరును ఏఈవోలు పర్యవేక్షిస్తున్నారు.
మండలంలో మూడు సంవత్సరాలుగా వరి సాగు పెరిగింది. రైతులకు పంటలపై వ్యవసాయ శాఖ పూర్తి అవగాహన కల్పిస్తున్నది. అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు గోదావరి జలాలు, వర్షాలతో నిండాయి. రైతులు వేసుకున్న పంటలకు తగిన సూచనలు అందిస్తున్నాం. చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పెరుగడంతో రైతులు వరిసాగుపై మొగ్గు చూపుతున్నారు.
-రంజిత్ కుమార్, ఏవో
మండలంలో వర్షాకాలంలో వరి సాగుతో పాటు ఇతర పంటలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. వర్షాకాలంలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండడంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. క్షేత్రస్థాయిలో రైతుల పంటల వద్దకు వెళ్లి వరి సాగులో తీసుకోవాల్సిన మెళకువలు, సూచనలు, సలహాలు అందిస్తున్నాం.
-బొల్లం సౌజన్య, ఏఈవో, ముది మాణిక్యం