జగిత్యాల, సెప్టెంబర్ 18, (నమస్తే తెలంగాణ): విమోచనం పేరిట మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న శక్తులను తరిమికొట్టేందుకు ప్రతిపౌరుడు సంసిద్ధుడు కావాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని సంస్థానాల మాదిరిగానే హైదరాబాద్ సైతం భారత యూనియన్‌లో సమైక్యమైందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వక్రీకరించేందుకు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరిరోజైన ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లాకేంద్రంలోని సుమంగళి గార్డెన్స్‌లో కళోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. చిందు, యక్షగాన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పులతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్, రమణ, కలెక్టర్ జీ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శనలిచ్చిన కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్ ప్రసంగించారు. దేశ సమగ్రతకు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. దేశంలోని ప్రాంతాల మధ్య అస్థిరత్వాన్ని సృష్టించేందుకు విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో మనమందరం ఐక్యతను చాటాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనం విషయాన్ని కొందరు మతాల మధ్య విబేధాలుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.
రాజకీయ లబ్ధికోసమే ఈ మహత్తర ఘట్టాన్ని వివాదం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తెలంగాణ సమైక్యతను చాటేలా, రాష్ట్ర అభివృద్ధి కండ్లకు కట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇది ఓర్వలేని కొందరు నేతలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ సకల సౌకర్యాలతో గురుకులాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
కళోత్సవాల్లో గురుకుల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అత్యద్భుతంగా ఉన్నాయన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాట ఔన్నత్యాన్ని చాటేలా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, అరుణశ్రీ, ఆర్డీవో లు మాధురి, వినోద్ కుమార్ ఉన్నారు.