కరీంనగర్, రాంనగర్/ జగిత్యాల కలెక్టరేట్ సెప్టెంబర్ 18: కరీంనగర్, జగిత్యాల జిల్లా కేంద్రాల్లో ఆదివారం తెల్లవారు జామున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు. జగిత్యాలలోని టవర్ సర్కిల్, ఉస్మాన్పుర, రహమత్‌పుర, తారకరామానగర్‌లో తనిఖీలు చేపట్టారు. పీఎఫ్ఐ కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తుల దుకాణాలు, ఇండ్లల్లో తనిఖీలు చేపట్టారు. క్లాక్ టవర్ సమీపంలోని ఓ మెడికల్‌షాపు షెట్టర్ తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లారు. అక్కడ పలు పత్రాలు, సీసీ కెమె రా డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్థానిక పోలీసులు ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే జగిత్యాలకు చెందిన ఎండీ ఇర్ఫాన్ అనే యువకుడు కరీంనగర్లో తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఆయన బంధువుల ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పేరుతో ఒక వర్గానికి చెందిన యువకులను చేరదీసి సంఘ వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నారనే సమాచారంతోపాటు పీఎఫ్ఐకి దేశ విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రావడంపై ఎన్ఐఏ దృష్టి సారించింది. గత జూలై 4న నిజామాబాద్‌లో నమోదైన కేసులో పీఎఫ్ఐకి చెంది న అబ్దుల్ ఖాదర్, షేక్ సహదుల్లా, ఎండీ ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్‌ను నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెలుగు చూసిన అంశాలతో గత నెల 26న ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారు జామునుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38 చోట్ల, ఆంధ్రప్రదేశ్‌లో రెండుచోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. నిజామాబాద్‌లో 23, హైదరాబాద్‌లో 4, జగిత్యాలలో7, నిర్మల్‌లో 2,కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కోచోట తనిఖీలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో కూడా సోదాలు నిర్వహించి అబ్దుల్ ఖాదర్‌తో పీఎఫ్ఐతో లింక్‌లు ఉన్న 26 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పీఎఫ్ఐ కార్యకలాపాలు, క్యాంపులు నిర్వహిస్తూ, యువకులను చేరదీస్తూ సంఘ వ్యతిరేక కార్యకలాపాల కోసం శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో పలు సాహిత్యంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, కరపత్రాలు, రూ.8.31 లక్షల నగదు సీజ్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.