కార్పొరేషన్, సెప్టెంబర్ 17: తెలంగాణ పోరాట, ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొటాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ కుట్రలు పన్నే వారి విద్వేషాన్ని వివేకంతో ఓడిద్దామని సూచించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా శనివారం పరేడ్‌గ్రౌండ్‌లో పోలీసుల గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించి జాతీయగీతం పాడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రోజుని పేర్కొన్నారు. 74 ఏళ్ల కిత్రం ఇదే రోజు మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందన్నారు. ఇటీవలే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నామని తెలిపారు.
దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం సఫలీకృతమై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కాకపోతే రాష్ట్ర సంపద పెరిగేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంపదను పెంచి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నారని, భావితరాలకు బంగారు బాటలు వేస్తున్నారని వివరించారు. గాంధీ సామరస్య విలువలు, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మతాతీత దేశభక్తి, నాటి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైందన్నారు. ఆనాటి ఉజ్వల ఘట్టాలను, యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఆదివాసీ యోధుడు కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకోవాలన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీమూర్తుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో, తెలంగాణ 60 ఏళ్ల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించి, నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందన్నారు. కేసీఆర్ పాలనలో అనతికాలంలోనే ఈ ప్రాంతం రైతాంగం ఎదురొంటున్న ప్రధాన సమస్యలైన సాగునీటి, కరెంటు సమస్యలను తీర్చగలిగామన్నారు. తెలంగాణలో సాగు, తాగునీటి కోసం గోస పడిన రోజులు రాష్ట్రంలో తిరిగి కనబడకూ డదని, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం మహా ప్రాజెక్టును నిర్మించారని, దీంతో తెలంగా ణను సస్యశ్యామలంగా మార్చుకున్నామన్నారు.
రైతులను ఆదుకునేందుకే సంక్షేమ పథకాలు
ప్రతి రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబంధుతో 2022 వానకాలానికి సంబంధించి 1,81,725 మంది రైతులకు రూ.177 కోట్ల 67 లక్షలను వారి ఖాతాలలో జమ చేశామన్నారు. జిల్లాలో 94,874 వ్యవసాయ బావులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.100 కోట్లకు పైగా సబ్సిడీ భరిస్తున్నదని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని మొత్తం 494 నివాసాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.1492 కోట్లు మంజూరు చేసిందన్నారు. వాటితో 22 కట్టడాలు 1232 కిలోమీటర్ల మేరకు పైపులైన్ల పనులు పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.
దళితబంధుతో ఆర్థికాభివృద్ధిలో దళితులు
అంబేదర్ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్రంలో దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. జిల్లాలో సెప్టెంబర్ 14 వరకు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీ, రూరల్, జమ్మికుంట ము న్సిపాలిటీ, రూరల్, వీణవంకలో 13,701 రైతుబందు ప్రొసీడింగ్స్‌ను జారీ చేసుకుని 12,015 యూనిట్లను గ్రౌండింగ్ చేసుకున్నామన్నారు. ఇటీవల జిల్లాను సందర్శించిన నీతి అయోగ్ కమిటీ సభ్యులు కూడా జిల్లాలో ప్రవేశ పెడుతున్న దళిత బంధు పథకం అద్భుతంగా అమలవుతున్నదని ప్రశంసించారని గుర్తుచేశారు.
చేనేత కార్మికుల బీమా సదుపాయం
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు అవసరమైన నూలు, రసాయనాల కొనుగోలుపై 40 శాతం రాయితీ అందిస్తున్నదన్నారు. రైతు బీమా మాదిరిగానే నేతన్న బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి నేత కార్మికులకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్నామన్నారు. నీలి విప్లవంతో దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి స్థాయికి చేరుకున్నామన్నారు. జిల్లాలోని 897 చెరువుల్లో 2.30 కోట్ల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేశామని, ఆగస్టు 5న మానేరు డ్యాంలో 100శాతం ఉచితంగా 40వేల కట్ల చేపపిల్లలు, 50 వేల రవ్వు, 10వేల మ్రిగళ చేప పిల్లలను విడుదల చేశామన్నారు.
జిల్లాకో మెడికల్ కళాశాల. . పరిశుభ్రంగా గ్రామాలు
కరీంనగర్ జిల్లాకు రూ.150 కోట్లతో మెడికల్ కాలేజీని మంజూరు చేశారని, 100 మెడికల్ సీట్లతో తరగతులు నిర్వహించేలా జిల్లా జనరల్ హాస్పిటల్‌ను బోధన దవాఖానగా ఆప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా దవాఖానలో నిర్మించిన 150 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ దవాఖానలో నెలకు 800 నుంచి 900 వరకు ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. సర్కారు దవాఖానల్లో ప్రసవించిన బాలింతలకు మగ శిశువు జన్మిస్తే రూ.12వేలు, ఆడశిశువు జన్మిస్తే రూ.13వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు.
అర్హులందరికీ ఆసరా
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనే త కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హె చ్ఐవీ ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులకు కూడా పింఛన్ మంజూరు చేశామన్నా రు. జిల్లాలో లక్షా 15 వేల 995 మందికి ఆసరా పింఛన్లను ప్రతి నెలా అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 57 ఏండ్లు దాటిన 31,822 మందికి పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేస్తున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మే యర్ చల్ల స్వరూపరాణి, సుడా చైర్మన్ జీవీ రా మకృష్ణారావు, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.