విశ్వమంతా ఆనందమయం
దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పూజ్య శ్రీ ఆత్మానందమయి
కొత్తపల్లి, సెప్టెంబర్ 11 : భగవత్ స్వరూపులు, దైవాంశ సంభూతులు, పరమ గురువైన శ్రీ భోగనాథ మహర్షి ప్రసాదించిన సుషుమ్న క్రియా యోగాతో విశ్వమంతా ఆనందమయం అవుతుందని, గృహస్తులైన వారు సైతం చేస్తూ మోక్ష స్థితిని సులభంగా పొందవచ్చని దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బొమ్మకల్ రోడ్డులోని వీ కన్వెషన్ ఫంక్షన్హాల్లో ఆమె సుషుమ్న క్రియా యోగా దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ భోగనాథ మహర్షి క్రియా యోగాను ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బోధించారన్నారు. ధ్యానంలో మనచుట్టూ దైవశక్తి ఒక కవచంలా ఏర్పడి నిత్యానంద స్థితికి తీసుకువెళ్తుందన్నారు.
సుషుమ్న క్రియా యోగా ధ్యానం బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య చేయడం శ్రేయస్కరమని చెప్పారు. రోజూ పడుకొనే ముందు 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఆ నిద్ర యోగా నిద్రగా పరిగణించబడుతుందన్నారు. సుషుమ్న క్రియా యోగా ధ్యానాన్ని ఏ మతంవారైనా, ఏ వయస్సు వారైనా, ఏ ప్రదేశంలోనైనా చేయవచ్చన్నారు. అనంతరం ఓంకారం, దీర్ఘశ్వాసలు, యోగా ముద్ర, సుషుమ్న నాడీల గురించి చెబుతూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా సాధకులు మూడు ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలని అవి పవిత్రత, ఓర్పు, పట్టుదల అని తెలిపారు. అంతకుముందు సుషుమ్న క్రియా యోగా ప్రాముఖ్యతను దివ్య బాబాజీ యోగా ఫౌండేషన్ సభ్యురాలు శ్రీలక్ష్మి వివరించారు. కరీంనగర్లో ప్రతి పౌర్ణమి రోజున సుషుమ్న క్రియా యోగా దీక్షను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, విద్యా సంస్థల బాధ్యులు, నగర ప్రముఖులు పేర్యాల రవీందర్రావు, డాక్టర్ ఈ ప్రసాదరావు, శ్రీనివాసరావు, నర్సింగరావు, రమణారావు, సౌగాని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.