ధర్మపురి/ ధర్మారం, సెప్టెంబర్ 5: ‘ఆ నాటి ప్రభుత్వాల నిర్వాకంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు లేక మత్ససంపద తగ్గిపోయింది. మత్స్యకారులు కూలీ పని చేసుకొని బతికే పరిస్థితి వచ్చింది. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. తెలంగాణ ఫిష్ హబ్‌గా మారిపోయింది’ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ధర్మారం, ధర్మపురి మండలాల్లో పర్యటించారు. ముందుగా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది రిజర్వాయర్‌లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో లక్ష చేప విత్తనాలు పోశారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ‘స్వచ్ఛ్ గురుకుల్ డ్రైవ్’ను జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాయంత్రం ధర్మపురి మండలం బుగ్గారం పెద్దమ్మ చెరువులో 70వేల చేప పిల్లలను వదిలారు. అలాగే బుగ్గారంలో 779 మందికి నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఆయాచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 46వేల చెరువుల్లో, రిజర్వాయర్లలో ఏటా ఉచితంగా చేప పిల్లలను వదులుతూ, అనేక పథకాలు అమలు చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపామని, మత్స్యకారులను ఆర్థిక అభ్యున్నతిలోకి తెచ్చామని చెప్పారు. చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు సబ్సిడీపై లగేజీ ఆటోలు, మోపెడ్లు అందిస్తున్నామని వివరించారు. వందశాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో మత్స్య రంగం దశ తిరిగిందని, దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఈ యేడాది నంది రిజర్వాయర్‌లో 6 లక్షల చేప పిల్లలు లక్ష్యంగా నిర్ణయించామని, అలాగే రొయ్యలు పిల్లలు పోస్తామని చెప్పారు. చేపలు బయటికి వెళ్లకుండా రూ.20లక్షలతో జాలీ ఏర్పాటు చేయిస్తామన్నారు.
మన గురుకులాలు దేశానికే ఆదర్శం
పేద విద్యార్థులు విద్యనభ్యసించేందుకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. నంది మేడారంలోని బాలికల గురుకుల విద్యాలయంలో ‘స్వచ్ఛ్ గురుకుల్ డ్రైవ్’ను ప్రారంభించి, మాట్లాడారు. గురుకులాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధిస్తూ విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే స్థాయికి తీసుకువచ్చామన్నారు. గురుకుల విద్యావిధానం గురించి ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు మనదగ్గరకు వచ్చి అధ్యయనం చేయడం గర్వంగా ఉందన్నారు. గురుకులాల ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్ పర్యవేక్షణలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయనేందుకు ఇదే నిదర్శమని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి ఎంపీపీ బాధినేని రాజమణి, ధర్మపురి జడ్పీటీసీ బాధినేని రాజేందర్, ధర్మారం జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ధర్మపురి వైస్ ఎంపీపీ జోగినపల్లి సుచేందర్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు గాలిపెల్లి మహేశ్, ఆర్బీఎస్ కన్వీనర్ తాండ్ర సత్యనారాయణరావ్, నంది మేడారం సర్పంచ్ సామంతుల జానకి -శంకర్, ఎంపీటీసీ మిట్ట తిరుపతి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఉన్నారు.