పర్యాటక కేంద్రంగా మారుతున్న కరీంనగర్ నగర శివారులో ‘మానేరు రివర్ ఫ్రంట్’ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోబోతున్నది. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి, చెక్‌డ్యాంల నిర్మాణాలు తుది దశకు చేరుకోగా, ‘ఎంఆర్ఎఫ్’ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా, ఇటీవలే 410 కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రపంచ స్థాయి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కసరత్తు ముమ్మరమైంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించడం, వారంలోగా టెండర్లు పూర్తిచేసి త్వరలోనే పనులు ప్రారంభించాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్పొరేషన్, డిసెంబర్ 16: కరీంనగర్ శివారులో ‘మానేరు రివర్ ఫ్రంట్’ ప్రాజెక్టు పనులు వేగవంతమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సర్కారు కూడా 410కోట్లు విడుదలకు ఉత్తర్వులు ఇవ్వగా, మొదటి నుంచీ మంత్రి గంగుల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో యంత్రాంగం డీపీఆర్ సిద్ధం చేసింది. అతి త్వరలోనే టెండర్లు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. వారం రోజుల్లోగా టెండర్లు పూర్తిచేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ప్రధానమైన నదికి ఇరువైపులా రిటర్నింగ్ వాల్స్ నిర్మాణంతో పాటుగా, బరాజ్, లోయర్ ప్రామినాడ్, అప్పర్ ప్రామినాడ్లకు సంబంధించిన డీపీఆర్‌లు కూడా సిద్ధం చేశారు. కాగా, ప్రాజెక్టులో బోటింగ్, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్‌స్పోర్ట్స్, పౌంటేన్లు, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్స్ గార్డెన్స్, ప్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగ్‌లు, స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లో, టెన్నిస్, వాలీబాల్ కోర్టులు, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ తదితర వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌ను సర్కారు లక్ష్యం మేరకు అనుకున్న టైంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పర్యాటకంగా మానేరు తీరం..
మానేరు రివర్ ఫ్రంట్‌ను రెండు విడుతల్లో చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మొదటి విడుతలో 7 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయడంతోపాటు రెండో విడుతలో నదీ తీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నదిలో పూర్తిస్థాయిలో బోటింగ్ నిర్వహించుకునేందుకు వీలుగా ఇప్పటికే నదిలో ఆరుకు పైగా చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. వీటితో పాటుగా రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టి నీటి నిల్వ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వీటితో పాటు నదికి ఇరువైపులా ప్రభుత్వ స్థలాలతో పాటుగా ప్రైవేటు స్థలాలను కూడా సేకరించి ప్రపంచస్థాయి ప్రమాణాల్లో అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు.
మంత్రి గంగుల సమీక్ష..
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తయితే నగరానికి కొత్త శోభ రానుండగా, ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌పై గురువారం మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్ జలసౌధలో ఇరిగేషన్, టూరిజం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులోని పలు నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై ఏజెన్సీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. వారంలోగా ప్రాజెక్టులోని వివిధ పనులకు టెండర్లను పూర్తి చేసి, త్వరలోనే పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మానేరు రివర్‌ఫ్రంట్ పనులను చేపట్టనున్నామని, అందుకు ప్రభుత్వం ఇప్పటికే 410కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఏకకాలంలో సివిల్, టూరిజం పనులను చేపట్టేలా ప్రణాళికలను రూపొందించామని, జోన్లవారీగా అమ్యూజ్మెంట్, వాటర్ పార్క్‌లను అభివృద్ధి చేయనున్నామని, ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ పటంలో కరీంనగర్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని మంత్రి నొక్కి చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన తీగల వంతెన నిర్మాణం పూర్తయిందని తెలిపారు.