జమ్మికుంట, డిసెంబర్ 16: ప్రకృతి సేద్యాన్ని ఉద్యమంలా చేపట్టాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి పీ విజయగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని కేవీకేలో ‘ప్రకృతి వ్యవసాయం-నేల తల్లికి నీరాజనం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రకృతి సాగులో జిల్లా రైతులు ముందుకుపోతున్నారని, తెలంగాణ రైతాంగం దేశానికే రోల్ మోడల్‌గా నిలువాలని కోరారు. రసాయన ఎరువులు విరివిగా వాడితే భూసారం తగ్గి సూక్ష్మ జీవులన్నీ మృతి చెందుతాయన్నారు. భూసారాన్ని పెంచుకోవడంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు వస్తున్నాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రకృతి సాగు చేసిన రైతులకు కేవీకే నుంచి సర్టిఫికెట్లు అందిస్తామని, క్రయవిక్రయాల కోసం నిల్వ చేసుకునేందుకు గోదాములను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రకృతి సాగు చేసే రైతులకు నేరుగా సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రకృతి సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. ప్రశంసాపత్రాలను అందించారు. అంతకుముందు సేంద్రియ వ్యవసాయ సమ్మేళనం సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ నుంచి ఇచ్చిన సందేశాన్ని డిజిటల్ స్క్రీన్‌పై రైతులు వీక్షించారు. శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు (సీనియర్ అండ్ హెడ్), విజయ్, వేణుగోపాల్, ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంతి, బీఆర్ సింగ్, రైతులు, విద్యార్థులున్నారు.
నా పంటకు రోగమే రాలె
మొదట్ల 12గుంటలల్ల ప్రకృతి సాగు మొదలు పెట్టిన. మా ఇంటి మందం తినడానికి పెట్టుకున్న. ఏటా సాగు పెంచుకుంట పోయిన. ఏడేైళ్లెతంది. నా పంటలకు రోగాలే రాలె. మన పెట్టుబడి ఒక్క శ్రమే. ఇంటి ముందట బత్తాయి, నిమ్మ, జామ, అల్లనేరేడు చెట్లు పెట్టుకున్న. పండ్లు వత్తన్నయ్. నేను చాలా మందికి చెప్పిన. కొందరు సాగుజేత్తన్రు.
150 రకాల విత్తనాలు సాగు జేత్తన్న
11 ఏండ్ల నుంచి ప్రకృతి వ్యసాయం జేత్తన్న. ఇప్పటికీ 150 రకాల విత్తనాలు తయారు జేసిన. అందరికీ ఇస్తున్న. పాలేకర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న. ఆరోగ్యకరమైన పంటలు అందిత్తన్న. పౌష్టికాహారం అందించడమే నా లక్ష్యం. పైసా ఖర్చు లేదు. చెప్పిన ధరలకు కొనుక్కుంటన్రు. ఇంకొందరికి సాగు పద్ధతి సూపుతన్న. వారిని ఎంకరేజ్ చేత్తన్న.
దీంట్ల శ్రమనే పెట్టుబడి
ప్రకృతి సాగులో శ్రమొక్కటే పెట్టుబడి. ఇండ్ల కష్టం, సంతోషం రెండూ ఉన్నయ్. నాకు నాల్గెకరాలుంటే 20గుంటల్లోనే ప్రకృతి వ్యవసాయం చేసిన. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాగు చేయాలె. తర్వాత నల్గురికి చెప్పాలె. నా లెక్క ప్రకృతి సాగు చేసేటోళ్లంతా ఇతర రైతులకు జెప్పాలె. గ్రామాలన్నీ ప్రకృతి సాగు చేసేలా చూడాలె.
రెండెకరాల్లో కూరగాయలు సాగు చేత్తన్న
2012ల కేవీకే వాళ్లు ప్రకృతి సాగు చెయ్యమని చెప్పిన్రు. 2013ల 20గంటలల్ల పత్తి బెట్టిన. పెద్దగా దిగుబడి రాలె. కానీ, పత్తి గింజలను కొందరు కొనుక్కపోయిన్రు. క్వింటాల్‌కు రూ.12వేలచ్చినయ్. బాగున్నదని అట్లే పెట్టిన. ఇప్పుడు రెండెకరాల్లో కూరగాయలు సాగుజేత్తన్న. నన్నుజూసి మరికొందరు మా ఊళ్ల ఇదే సాగు జేత్తన్రు.
సమన్వయంతో ముందుకుసాగాలి
ప్రకృతి సేద్యం చేసే రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల సలహా లు, సూచనలు తీసుకోవాలి. సమన్వయంతో ముందుకు సాగాలి. భూమిలో కర్బనాన్ని పెంచుకోవా లి. భూసారం పెరిగేలా చర్యలు చేపట్టాలి. ఈ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది. నీటిని ఆదా చేసుకోవచ్చు. ప్రకృతి సాగు నుంచి వచ్చిన పంటకు డిమాండ్ ఉంది.
దిగుబడి తగ్గినా డిమాండ్ ఉంటది
నేల ఆరోగ్యంగా ఉంటేనే మని షి ఆరోగ్యంగా ఉంటడు. ఆరోగ్య భద్రతకు నేచురల్ ఫార్మింగ్ చేయా లి. పురుగు మందులు వాడవద్దు. ప్రకృతి సిద్ధమైన ఎరువులను వాడుకుందాం. ప్రకృతి సాగును కేవీకే ప్రోత్సహిస్తున్నది. ఎల్లవేళలా అందుబాటులో ఉంటం. ఈ సాగుతో పెట్టుబడి తగ్గుతది. దిగుబడి తగ్గినా ఫర్వాలేదు కానీ.. డిమాండ్ వస్తది.
నేల తల్లిని కాపాడుకుందాం
ఇన్నాళ్లు రసాయన ఎరువులతో భూమిని నాశనం చేసుకున్నం. ఇగ నేల తల్లిని కాపాడుకుందాం. ప్రకృ తి సాగును చేయాలి. ఆవులు, బర్ల ను పెంచుకుందాం. వాటి పెండ, మూత్రం భూముల్లో వేసుకుంటే భూసారం పెరుగుతుంది. ఖర్చు లేని వ్యవసాయం ఇది. పాలేకర్ స్ఫూర్తితో ముందుకుసాగాలి. ఇప్పటికే మన జిల్లాలో రైతులు సాగు చేస్తున్నరు.
ప్రకృతి సాగులో పట్టుదలుండాలె
ఏడేండ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేత్తన్న. ఇందులో పట్టుదలుండాలె. లేకుంటే నష్టపోతం. మొదట ఇబ్బంది పడ్డ. దిగుబడి రాలె. తర్వాత శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్న. ఇప్పుడు నష్టమేమీ లేదు. ఎకరాకు 35 బత్తాల వడ్లు పండిత్తన్న. మేం పండించుకుని తింటున్న పంటతోటి మాకెలాంటి రోగాల్లేవు. ఇప్పటివరకు దవాఖానకు పోలె.