Vijay Mallya : పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya).. తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు (Bombay High Court) కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్పుడు తిరిగి వస్తాననేది కచ్చితంగా చెప్పలేనని మాల్యా పేర్కొన్నారు.
ఈ మేరకు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ (Amit Desai).. బాంబే కోర్టులో ఒక స్టేట్మెంట్ను సబ్మిట్ చేశారు. మాల్యా దగ్గర యాక్టివ్ ఇండియన్ పాస్పోర్టు లేదని, అదేవిధంగా దేశం దాటి వెళ్లకుండా ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆ సబ్మిషన్లో అమిత్ దేశాయ్ పేర్కొన్నారు.
బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అనఖాద్లతో కూడిన ధర్మాసనం.. గత వారం విజయ్ మాల్యా పిటిషన్పై విచారణకు నిరాకరించింది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్పై.. అతను భారత్కు రాకుండా విచారణ జరపలేమని స్పష్టం చేసింది. మాల్యాకు భారత్కు తిరిగొచ్చే ఉద్దేశం ఉందా.. లేదా..? అని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా తన తరఫు న్యాయవాది ద్వారా బాంబే హైకోర్టులో తాజా స్టేట్మెంట్ను సబ్మిట్ చేశారు. మాల్యా పిటిషన్ విచారణ జరిపేందుకు ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని దేశాయ్ వాదించారు. కాగా మాల్యా 2016 మార్చి నుంచి యూకేలో ఉంటున్నారు. లోన్ల ఎగవేత, మనిలాండరింగ్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు.