జగిత్యాల రూరల్, ఆగస్టు 2 : హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో పలు రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. బీర్పూర్ మండల రోళ్లవాగు ప్రాజెక్ట్, అర గుండాల ప్రాజెక్ట్ భారీ వర్షాలు, వరదలకు ప్రాజెక్ట్‌లకు నష్టం వాటిల్లిందని వివరించారు. నీటి నిల్వ సామర్థ్యం లేకుండా పోయిందని, ప్రాజెక్ట్ కట్ట మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలని, దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరగడమే కాకుండా ఇసుక మేటలు వేయడం వల్ల పంట సాగుకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. రైతులకు నష్ట పరిహారం అందజేయాలని, వారికి బాసటగా నిలవాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఎన్హెచ్ఏ చీఫ్ జీఎంను కలిసిన ఎమ్మెల్యే
నేషనల్ హైవే అథారిటీ చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్వో కృష్ణ ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం కలిశారు. జగిత్యాల నుంచి తిప్పన్నపేట వెళ్లే రహదారి, ధరూర్ వెళ్లే రహదారి నాలుగు లైన్లతో బ్లాక్ స్పాట్ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. దీంతో ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందన్నారు. నాలుగు లైన్ల రహదారి వల్ల వాహనదారుల రాకపోకలు క్రమపద్ధతిలో సాగుతాయని, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అంతకుముందు జగిత్యాల చల్గల్ రహదారి బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు చేయడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.