ధర్మపురి, ఆగస్టు 2: రాష్ట్రంలో దళిత సాధికారత కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం రూపొందించారని రాష్ట్ర ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం 100మంది లబ్ధిదారులకు రూ.10కోట్ల విలువైన ఆస్తులను పంపిణీ చేశారు. వీటిలో వాహనాలు, టెంట్ హౌస్ సామగ్రి, సూపర్‌మార్కెట్, ఇతరత్రా యూనిట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ఈ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తుందన్నారు.
నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున వచ్చే ఎన్నిమిదేళ్లలో 17లక్షల దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నారనీ, అదే సమయంలో ప్రభుత్వం లైసెన్సు అందించే వ్యాపారాలలో దళితులకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దళిత బంధు పథకంపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలన్నారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ లబ్ధిదారులు రూ.10లక్షల యూనిట్‌ను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధ్ది సాధించాలని ఆకాంక్షించారు.
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ దళిత అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారనీ, ఈ పథకం దేశానికే ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా. శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సంక్షేమశాఖ అధికారి డా.నరేశ్, ఎంపీపీలు ఎడ్ల చిట్టిబాబు, సుధారాణి, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.