నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రాష్ట్ర సర్కారు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. సిరిసిల్ల గడ్డ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ‘రైతు బీమా’ తరహాలో ‘నేతన్న బీమా’కు అంకురార్పణ చేయబోతున్నది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న లాంఛనంగా ప్రారంభించనున్నది. 18 నుంచి 59 ఏండ్ల వయసున్న చేనేత, మరమగ్గాల కార్మికులు అర్హులు కాగా, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనున్నది. దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల సాయం అందించి ఆర్థిక భరోసానివ్వనున్నది. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో అమలు కానుండగా, ఇది నేతన్న కుటుంబాలకు ధీమా ఇవ్వనున్నది. ఎక్కడా లేని విధంగా తమ కోసం పథకాలు తీసుకొస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని కార్మికలోకం చెబుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్/గంగాధర: నేతన్నల సంక్షేమానికి ఆది నుంచీ అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలవుతున్న రైతు బీమా తరహాలోనే నేతన్నకూ 5 లక్షల వ్యక్తిగత బీమా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతేడాది సిరిసిల్ల పర్యటన సందర్భంగా మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బీమా పథకం అమలు కోసం 29.98 కోట్లను రెండు నెలల క్రితమే విడుదల చేయగా, ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది. రాజన్న సిరిసిల్ల, నల్గొండ, పోచంపల్లి, దుబ్బాక, నారాయణపేట, వరంగల్, కరీంనగర్, భువనగిరి జిల్లాల్లో చేనేత, మరమగ్గాల కార్మికులుండగా, అందులో ఎక్కువ సంఖ్యలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు.
చేనేత దినోత్సవం నుంచే అమలు
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచే నేతన్న బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నది. రైతు బీమా మాదిరిగానే చేనేత, మరమగ్గాల కార్మికులకు ఈ అవకాశం కల్పించనున్నది. 18 నుంచి 59 ఏండ్ల వయసున్న ప్రతి ఒక్కరినీ ఈ పథకంలో చేర్పించనున్నది. కాగా, దురదృష్టవశాత్తూ కార్మికుడు మరణిస్తే బీమా కింద 5 లక్షల సొమ్ము కుటుంబానికి అందించనున్నది. ఈ మేరకు చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్ ఆ శాఖకు సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. చేనేత, మరమగ్గాల కార్మికులతోపాటు అనుబంధ పరిశ్రమలైన డైయింగ్, వార్పిన్, సైజింగ్, వైపనీ కార్మికులందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన జౌళీశాఖ త్రిఫ్టు పథకంలో చేరిన కార్మికుల వయో పరిమితిని పరిశీలించి బీమా పథకంలో అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలాపూర్, జమ్మికుంట, కొత్తపల్లి, గర్శకుర్తి, చందుర్తి, ముల్కనూరు, జగిత్యాల, చొప్పదండి, సిరిసిల్లలో చేనేత, మరమగ్గాల పరిశ్రమలుండగా, ఇందులో 15 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. అందులో దాదాపు 10వేల మంది కార్మికులు సిరిసిల్ల జిల్లాలో ఉండగా, కరీంనగర్ జిల్లా పరిధిలో 1,940 మంది ఉన్నారు.
సర్కారే ప్రీమియం చెల్లింపు
18 నుంచి 60ఏళ్లలోపు వయసున్న కార్మికులందరూ ఈ పథకానికి అర్హులు కాగా, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనున్నది. ఒక్కొక్కరికి 2,271.50 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 వేల మందికి సంబంధించి ఏటా 3.40 కోట్ల భారం ప్రభుత్వంపై పడనున్నది. ఈ పథకం ద్వారా నేతన్నలకు ధీమా లభించనున్నది.
మరమగ్గాల నుంచే ఎక్కువ..
బీమా పథకంలో ఎక్కువగా మరమగ్గాల పారిశ్రామికులు ఉన్నారు. సిరిసిల్లతోపాటు గంగాధర మండలం గర్షకుర్తి, గట్టుభూత్కూర్, కరీంనగర్ నగరంతోపాటు రూరల్ మండలంలోని దుర్శేడ్, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లో ఉన్నారు. మరమగ్గాల్లో ఎక్కువగా ఈ తరం జనరేషన్ వస్తుండగా, చేనేత రంగంలో 60 ఏండ్లు దాటిన వాళ్లే ఎక్కువ మంది పని చేస్తున్నారు. కరీంనగర్ చుట్టపక్కలతోపాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో కొద్ది మంది మాత్రమే చేనేత పారిశ్రామికులు పనులు చేస్తున్నారు. జమ్మికుంట, వీణవంక మండలం కోర్కల్, ఆముదాలపల్లి, చొప్పదండి పట్టణం, కరీంనగర్ మండలం చామన్‌పల్లిలో మాత్రమే చేనేత పారిశ్రామికులు ఉన్నారు.
ఉద్యమ కాలంల నేతన్న కష్టాలను స్వయంగా చూసిన. సిరిసిల్లల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నరు. కుటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకున్నోళ్లు లేరు. అప్పడే ఏదైనా చేయాలని ఆలోచించినం. తెలంగాణ వచ్చినంక అన్ని రకాలా అండగా నిలిచినం. మంత్రి కేటీఆర్ చొరవతో చేనేత రంగానికి ప్రాధాన్యమిచ్చినం. బతుకమ్మ చీరల ఆర్డర్‌తో ఉపాధి పెంచినం. దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీలు ఇచ్చినం. కార్మికుల వేతనాలు పెరిగేలా చేసినం. అయితే ఇవి తాత్కాలిక రిలీఫ్‌ను మాత్రమే ఇస్తయ్. ఇంకా చేయాల్సి ఉన్నది. ఏదేని కారణంతో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం అనాథ కావద్దు. అందుకే కార్మికక్షేత్రం గడ్డపై ఒక విషయాన్ని సగర్వంగా ప్రకటిస్తున్న. రైతుబీమా పథకం తరహాలోనే నేతన్నలకు బీమా పథకాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తం. రైతుబీమా ద్వారా పరిహారం ఎలాగైతే అందుతుందో.. అదే మాదిరిగా అందిస్తం.
– గతేడాది జూలై 4న సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఆపదకాలంల ఆదుకుంటది
నేను ఐదేండ్ల నుంచి చేనేత మగ్గం నేస్తున్న. నా భర్త రవి సోడాలు అమ్ముతడు. నేను ప్రతి రోజు సంఘానికి వచ్చి మగవారితో సమానంగ మగ్గం నేస్త. రోజుకు రూ.200 నుంచి రూ.300లు మాత్రమే సంపాదించే నాకు ఇల్లు గడవడమే కష్టం. అలాంటిది బీమా చేయించుకునే స్థోమత ఎక్కడుంటది. ఇప్పుడు తెలంగాణ సర్కారు మాకు నయా పైసా ఖర్చు లేకుండ ఉచితంగా బీమా చేయించడం ఒక కలలెక్కనే అనిపిస్తంది. ఈ పథకం మాలాంటి పేదోళ్లను ఆపదకాలంల ఆదుకుంటది.
– తాటిపాముల రమ, పద్మనగర్, హుజూరాబాద్ (హుజూరాబాద్‌టౌన్)
దేవుడిచ్చిన గొప్ప వరం
తెలంగాణ సర్కారు నేతన్న బీమాను ప్రవేశపెట్టడం మేం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నం. మా కార్మికులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ప్రభుత్వమే మా తరఫున ప్రీమియం చెల్లించి రూ.5 లక్షల బీమా చేయించడం గొప్ప విషయం. ఇన్నాళ్లూ మాకంటూ ఒక్క ఆర్థిక భరోసా లేదు. ఎప్పుడు ఏం జరిగినా ఆదుకునే వారు లేరు. కుటుంబం పరిస్థితి ఆలోచిస్తేనే ఆందోళనగా ఉండేది. నేతన్న బీమా వస్తుం దని అని తెలియగానే ఎక్కడలేని సంతోషమని పించింది. నిజంగా ఇది దేవుడిచ్చిన గొప్ప వరమే.
– సామల శంకర్, నేత కార్మికుడు గర్శకుర్తి(గంగాధర)
ఇది శానా మంచి పథకం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లు మా కోసం ఎంతో చేస్తున్నరు. మంచి మంచి పథకాలు తెచ్చి మాకింత బతుకుదెరువు చూపుతున్నరు. రైతుబీమా లెక్క మాకు కూడా నేతన్న బీమా పథకం తెచ్చిన్రు. ఇసొంటి పథకం నా జిందగీల చూడలె. శానా మంచి పథకం అయితది. మాకు ఏమన్న అయితే మా కుటుంబాలకు ఐదు లచ్చలు ఇస్తరట. ఇసొంటి ఆలోచన ఇంతకు ముందు ఎవలైనా చేసిన్రా? సాంచలు నడుపుకుంట పుసుక్కున సత్తె ఎవరైనా పట్టించుకున్నరా? ఆళ్ల కుటుంబాలకు ఇంత సాయం జేసిన్రా? ఇప్పడు మా కోసం పథకం తెచ్చిన్రు. ఎవరికైనా ఏమైనా అయితే కుటుంబాలకు ఇంత ఆసరా దొరుకుతది.
– గూడెల్లి సత్యనారాయణ, పద్మనగర్ (కరీంనగర్)
కుటుంబం రోడ్డున పడకుండ ఉంటది
నాటి పాలనలో దురదృష్టవశాత్తూ ఎంతో మంది నేత కార్మికులు ప్రాణాలు కోల్పోయిన్రు. కానీ, ఎవరూ ఆదుకోలె. ఆళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోలె. బతుకు దెరువు చూపలె. నేడు టీఆర్ఎస్ సర్కారు నేతకార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటంది. బతుకమ్మ చీరలతో ఉపాధి చూపింది. రుణాలు కూడా ఇస్తున్నది. ఇప్పుడు కుటుంబానికి భరోసాగా నిలవడుతున్నది. అనుకోకుండా కుటుంబపెద్ద చనిపోతే రోడ్డున పడకుంట చూస్తున్నది. పేదల కోసం పని చేస్తున్న కేసీఆర్ సారూ పదికాలల పాటు సల్లంగ ఉండాలె. ఈ సర్కారే ఎప్పటికీ ఉండాలె. మాలాంటోళ్ల కోసం కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి ఇట్లాంటివి కేసీఆర్ సార్ ఎన్నో తీసుకొచ్చిండు.
– బింగి నిర్మల, కార్మికురాలు (హుజూరాబాద్)
కేసీఆర్‌తోనే మాకింత బువ్వ
ఒకప్పుడు మా బతుకులు ఎట్లుండె. ఇప్పుడు ఎట్లున్నయ్. తెలంగాణ వచ్చినంక నాలుగు వేళ్లు నోట్లెకువోతున్నయ్. చేసి చేసి బొక్కలర్గినయ్. ఈ పని చేస్తే ఒక్కో రోజు వంద రూపాలు సుతం కూలీవడది. అప్పట్లనైతే అధ్వానంగ ఉండేది. ఇప్పుడు ఎంత చేసుకుంటె అంత కూలీ వడ్తంది. కానీ, చేసేటోళ్లే లేకుంటయితన్రు. మాకైతే ఇప్పుడు బీమా పథకం పెట్టిన కేసీఆర్ సారుకు శానా శానా రుణపడి ఉంటం.
– కట్ల విమల, మంకమ్మతోట
అర్హులందరికీ వర్తింపజేస్తాం..
మంత్రి కేటీఆర్ చొరవతో అర్హులైన ప్రతి చేనేత, మరమగ్గాల కార్మికుడికి 5 లక్షల బీమా సౌకర్యం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 7 జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఈ మేరకు జౌళీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం.
– మిట్టకోల సాగర్, చేనేత జౌళీశాఖ అధికారి (రాజన్న సిరిసిల్ల)
కలల గూడా అనుకోలె..
రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుంగా రాష్ట్ర సర్కారు రైతు బీమా కింద రూ.ఐదు లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నట్లు, నేత కార్మికులకు కూడా సర్కారు ఏదో ఒకటి చేస్తే బాగుండు అని ఎప్పుడూ ఆలోచన చేసేటోన్ని. ఏదో ఒకటి చేసుడు కాదు.. అచ్చం రైతు బీమా లెక్కనే సర్కారు నేతన్న బీమాను తెస్తదని అస్సలు కలలగూడా అనుకోలె. నేతన్న బీమా తెస్తున్నదని తెలిసినంక మాకొక భరోసా దొరికిందనుకున్నం. మా చేనేత కార్మికుల గురించి ఇంత గొప్పగ ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ నిజంగా గొప్ప వ్యక్తి.
– రేణికుంట శ్రీనివాస్, నేత కార్మికుడు, గర్శకుర్తి(గంగాధర)
కార్మికులకు సోషల్ సెక్యూరిటీ
నేతన్న బీమా పథకంతో కార్మికులకు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. రెక్కల కష్టంపై బతికే ఈ రంగంలోని వారు అకాల మరణం పొందితే ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పథకం నేత పారిశ్రామికుల కుటుంబాలకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. దీని గురించి ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. ఎప్పుడు అమలు చేస్తే అప్పుడు ఈ పథకం ప్రయోజనాలు నేతన్నలకు అందించేందుకు మా శాఖ సిద్ధంగా ఉన్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ప్రయోజనాలు అందేలా చూస్తాం.
– జీ సంపత్, చేనేత జౌళీశాఖ ఏడీ, కరీంనగర్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నడు
సాంచాలు నడిపే నాకు బీమాకు పైసలు కట్టుకునేంత స్థోమతెక్కడిది. చేసిన కూలీ కుటుంబాన్ని సాకేందుకే సరిపోతది. బీమా చేసుకోమని చాలా మంది చెప్పిన్రు. కేసీఆర్ సార్ రైతులకు బీమా చేసిండంటే మాకు జేస్తె బాగుండని అనుకున్నం. ఏడాది కింద వచ్చి మాకు బీమా కల్పిస్తమని చెప్పి మాట నిలబెట్టుకున్నడు. ఎల్ఐసీ కట్టి 5 లక్షల బీమా చేస్తున్నందుకు మా బతుకులకు భరోసా వచ్చింది. సార్‌ను ఎన్నటికీ మరిచి పోం.
– బేతి రాజు, కార్మికుడు (సిరిసిల్ల)
బతుకు మీద భరోసా
ఇన్నేండ్ల సంది సాంచాలలోనే సగం జీవితం గడిసింది. నాడు నెలకు పది వేల రూపాయలు కూడా కూలీ రాలే. నేడు బతుకమ్మ చీరలు నడిపిస్తే 20 వేల రూపాయలు అస్తున్నయి. బట్ట పొట్టకు రందీ లేదు. 50 ఏండ్లకే పింఛన్ ఇస్తన్రు. కేటీఆర్ సార్ దయతో ఇప్పుడు మాకు బీమా కల్పిస్తున్నరంట. ఇది టీవీల చూసి సంబుర పడ్డ. నాకు ఏమన్నయితే భార్య, పిల్లలు ఎట్లనని ఆలోచించే వాన్ని. ఇప్పుడు భరోసా వచ్చింది.
– చిలుక ప్రభాకర్, కార్మికుడు (సిరిసిల్ల)