గంభీరావుపేట, ఆగస్టు 1 : కులవృత్తులకు పునర్జీవం పోస్తున్న తెలంగాణ ప్రభుత్వం, గొల్లకుర్మల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసింది. అంతే కాదు, వాటిని రోగాల బారి నుంచి రక్షించేందుకు సంచార వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చింది. వాటి సంరక్షణకు సైతం చేయూతనందిస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రాలింగాపూర్‌లో గొర్రెల హాస్టల్‌ను నిర్మించింది. 37.66 లక్షలతో 2.20 ఎకరాల్లో నిర్మించిన 42 షెడ్ల సముదాయాన్ని మంత్రి కేటీఆర్ గతేడాది జూలై 21న ప్రారంభించారు. అప్పటి నుంచే అందుబాటులోకి రావడంతో యాదవులు హర్షం వ్యక్తం చేశారు. మూగజీవాలను అందులో ఉంచి రక్షిస్తున్నారు.
షెడ్లల్లో సకల వసతులు
మొదటి విడుత గొర్రెల పంపిణీ కింద సముద్రాలింగాపూర్లోని 42 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించారు. అయితే, చాలా మందికి ఇంటి వద్ద గొర్రెల పెంపకానికి అనువైన స్థలం లేకపోవడం, వాటి రక్షణ ఇబ్బంది కావడంతో యజమానులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మంత్రి కేటీఆర్ స్పందించి గ్రామ శివారులోని విశాలమైన స్థలంలో షెడ్ల నిర్మాణానికి చొరవ చూపారు. 2020 ఆగస్టులో పనులు ప్రారంభించి, 2021 జనవరిలో పూర్తి చేయించారు. గత జూలై 21న 42 షెడ్ల సముదాయాన్ని ప్రారంభించారు. గాలి, వెలుతురు, తగిన ఉష్ణోగ్రత ఉండేలా గదులను నిర్మించారు. షెడ్ల ముందర జాలీలు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ప్రత్యేక కుండీలు నిర్మించారు. గొర్రెల కాపరులు ఉదయాన్నే మూగజీవాలను మేతకు తీసుకెళ్తారు. చీకటి పడిన తర్వాత తిరిగి తోలుకువచ్చి ఇక్కడి జాలీల్లో ఉంచుతారు. వాన, చలికాలాల్లో మాత్రం షెడ్లలోకి తరలిస్తారు. భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా మూగజీవాలు తడవకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ వీటిని శుభ్రం చేస్తారు. విసర్జితాలను సమీపంలోనే నిలువ ఉంచి పంటలకు ఎరువుగా వాడతారు.
వాన పడినా చింత లేదు..
ఈసారి జూన్ రెండో వారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జూలై మొదటి వారం తర్వాతి నుంచి వారం పది రోజలపాటు దంచికొట్టాయి. తర్వాత కూడా పడుతూనే ఉన్నాయి. అప్పడు షెడ్లు గొర్రెలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. భారీ వానలు పడినా.. చుక్క నీరు పడకుండా జీవాలు నిద్రించాయి. ఇదే సమయంలో రాత్రి వేళ రక్షణ పెరిగింది. అడవి జంతువుల నుంచి ప్రమాదం తప్పింది. పొద్దంతా గొర్రెలను మేతకు తీసుకెళ్తున్నారు. సాయంత్రం తిరిగి తీసుకొచ్చి షెడ్లలో ఉంచి తాళం వేసి.. యజమానులు రందీ లేకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. చిన్న పిల్లలు, బలహీనమైన వాటిని గదుల్లోనే ఉంచుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మంచి వసతులతో హాస్టల్ నిర్మించి తమకు అందించిందని, ఇది తమ అదృష్టమని యాదవులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కేటీఆర్ సహకారంతోనే..
మా ఊరిలోని 42 యాదవ కుటుంబాలకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు ఇచ్చింది. అయితే, వీటిని ఇండ్ల వద్ద ఉంచి కాపాడుకోవడం ఇబ్బందవుతుందని లబ్ధిదారులు చెప్పిన్రు. నేను వెంటనే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన. అడిగిన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన్రు. గ్రామ శివారులోని రెండెకరాల 20 గుంటల స్థలంలో ఆర్నెళ్లలో షెడ్లు నిర్మించిన్రు. ఇందులో సకల వసతులు కల్పించిన్రు. సముదాయాల నిర్మాణానికి కృషి చేసిన కేటీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– మోతె రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం గంభీరావుపేట మండలాధ్యక్షుడు
చినుకు గూడ పడుతలేదు..
ఇంతకు మునుపు జీవాలను ఆరుబయట తాటికమ్మల పాకల్లో ఉంచేటోళ్లం. ఎండకు ఎండేవి. వానకు తడిసేవి. సలికి తట్టుకోలేక ఎన్నో జీవాలు సచ్చిపోయేటివి. కానీ, సర్కారు నిర్మించిన షెడ్లల్లో అన్ని సౌకర్యాలు ఉన్నయి. చిన్న వాన చినుకు కూడా పడుతలేదు. వరదలు వచ్చినా గొర్రెలు హాయిగా నిద్రపోతున్నయి. మాకు గూడ గోస తప్పింది.
– బంక భూమయ్య. యజమాని (సముద్రలింగాపూర్)