కోల్‌సిటీ, ఆగస్టు 1: ‘ఖబడ్దార్ మల్లన్న. నీది ఒక పేపరా..? నీతి నియమాలు లేని పత్రికలో ఇష్టమొచ్చినట్లు రాస్తే చూస్తూ ఊరు కోం. నీ అరాచకాలకు కవచంగా బీజేపీ ముసుగు కప్పుకున్న నీవు మా ఎమ్మెల్యే చందర్‌పై ఆరోపణలు చేయడం కాదు. ఈ నెల 4వ తేదీన రామగుండానికి వచ్చి నిరూపించకపోతే తర్వాత మేమే నీ కార్యాలయానికి వచ్చి ముట్టడి చేస్తాం. బ్లాక్ మెయిలర్‌గా చెలామణి నిన్ను, నీ రాతలు ఇక్క డ ఎవరూ నమ్మరు’ అంటూ రామగుండం నగర పాలక సంస్థ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. గోదావరిఖనిలో సోమవారం 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులెందర్ మాట్లాడారు. 4వ తేదీన రామగుండంకు వచ్చి ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వ్యాఖ్యలను సవాల్‌గా తీసుకున్నారు. ఎమ్మెల్యే చందర్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే నియోజక వర్గంలోని వెయ్యి మంది కార్యకర్తలతో తామే ఆయన కార్యాలయానికి వెళ్తామని తేల్చి చెప్పారు.
ఆర్ఎఫ్సీఎల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మొదటి నుంచి పోరాటం చేసిన ఎమ్మెల్యేకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు కొందరిని పావులుగా వాడుకొని ఎమ్మెల్యేపై బురదచల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారని వివరించారు. దళారులు వసూలు చేసిన దందాకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. డబ్బులు వసూలు చేసిన వారు తిరిగి బాధితులకు ఇవ్వకపోతే న్యాయపరంగా పోలీసులను కూడా ఆశ్రయించేందుకు చందర్ బహిరంగ ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు. ఒకరిద్దరి ఆరోపణలపై నిర్ధారణ చేసుకోకుండా మల్లన్న ఇష్టం వచ్చినట్లుగా అసభ్య పదజాలంతో జర్నలిజానికి మచ్చ తెచ్చేలా రాతలు రాయడాన్ని సహించబోమని పేర్కొన్నారు. రోజులో 18 గంటలు ఇక్కడి ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ఎమ్మెల్యే గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, బాల రాజ్‌కుమార్, నాయకులు పీటీ స్వామి, పాతపెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, తోకల రమేశ్ , తదితరులు ఉన్నారు.