హుజూరాబాద్ రూరల్, జూలై 17: నేరాల నియంత్రణకు పోలీసులు అమలు చేస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దాతల సహకారంతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ఇవి నేరాల నియంత్రణకు తోడ్పడుతున్నాయి. హుజూరాబాద్ డివిజన్లో వెయ్యికి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా నేరాల సంఖ్య తగ్గింది.
మేము సైతంపై అవగాహన కల్పించి..
పోలీస్‌శాఖ నేరాలను నియంత్రించేందుకు ‘మేము సైతం’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై పోలీసులు పట్టణ, గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించారు. దీనిపై ప్రజలతో కమిటీలు వేశారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులతోపాటు వివిధ వర్గాల ఆర్థిక సహకారంతో హుజూరాబాద్ డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
డివిజన్లో వెయ్యికి పైగా ఏర్పాటు
హుజూరాబాద్ పోలీస్ సబ్ డివిజన్లోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్, శంకరపట్నం పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్‌శాఖ ఆధ్వర్యలో వెయ్యికి పైగా సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ, మండలంలోని 19 గ్రామ పంచాయతీల పరిధిలో 270 సీసీ కెమెరాలను అమర్చారు. అలాగే జమ్మికుంట మున్సిపాలిటీతో పాటు మండలంలోని 23 జీపీల్లో 203, సైదాపూర్ మండలంలో 26 జీపీలకు 23 జీపీల్లో 126 ఏర్పాటు చేశారు. శంకరపట్నం మండలంలో 24 జీపీల్లో 160, వీణవంక మండలంలో 26 జీపీలకు 20 జీపీల్లో 241, ఇల్లందకుంట మండలంలో 18 జీపీలకు 17 జీపీల్లో 96 సీసీ కెమెరాలను బిగించారు.
తగ్గిన నేరాలు
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి నేరాలు చాలా వరకు తగ్గాయని పోలీసులు చెబుతున్నారు. గతంతో చోరీలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలు జరిగితే నిందితులను పట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో 24 గంటల్లోనే కేసులను ఛేదిస్తున్నారు. షాపులు, ఇంటి ఎదుట, పెట్రోల్ బంకులు, కళాశాలలు, స్కూళ్లలోనూ యజమానులు సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో దొంగల బెడద తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు.
ఇటీవల ఛేదించిన కేసులు
హుజూరాబాద్ పట్టణానికి చెందిన భగీరథ అనే యువకుడిని గత నెల 16న అర్ధరాత్రి రంగాపూర్ గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. హుజూరాబాద్ పోలీసులు 18గంటలు, సుమారు15 గ్రామాల్లోని 80 కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి వాహనాన్ని పట్టుకున్నారు. lఈ నెల 6న హుజూరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఇండియా వన్ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఒరిస్సాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు పది రోజుల్లో పట్టుకొని కటకటాల్లోకి పంపించారు. ఇలా నేరాలను త్వరితగతిన ఛేదిస్తున్నారు.
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడుతాయి. సెక్షన్-3(1)(2), 2013 యాక్ట్ ప్రకారం ప్రతి వ్యాపార సంస్థలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోకపోతే నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– వెంకట్‌రెడ్డి, ఏసీపీ, హుజూరాబాద్