వరి: నారు మళ్లు ఇప్పటి దాకా వేయకుంటే మరో 2-3 రోజులు వేచి చూడాలి. లేకుంటే వే సిన విత్తనం కుళ్లిపోతుంది. మొలక శాతం తగ్గుతుంది. ఇప్పటికే వరి నారు మళ్లు వేసుకున్న చోట మడిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ఒకవేళ ముదిరిన నారు నాటు వేసుకోవాల్సి వస్తే నాటేటప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి, కుదురు 6-8 మొక్కల చొప్పున నాటుకోవాలి. ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25శాతం పెంచి, మూడు సార్లు కాకుండా రెండు సార్లు 70శాతం నాటే సమయంలో, మిగతా 30శాతం అంకురం దశలో వాడాలి.
వెదజల్లే పద్ధతిలో విత్తుకున్న పొలాల మడుల్లో నిలిచిన నీటిని తొలగించాలి. చిన్న మొలకలు అధిక నీటిని తట్టుకోలేవు. కలుపు మందులు ప్రస్తుతం వాడద్దు. ఎందుకంటే మందు పని చేసే సామర్థ్యం తగ్గిపోతుంది.
వర్షాలు తగ్గిన తర్వాత వరి నారు మళ్లు, నాటు వేసిన ప్రధాన పొలాల్లో నారు ఎర్రబడే ప్రమాదం ఉంది. దాని నివారణకు యూరియా ఎకరాకు సరిపోయే నారుమడికి 1.5 నుంచి 2 కిలోలు వేయాలి. అలాగే 19.19.19 పోషకాన్ని 10గ్రాములు, కార్బెండిజమ్+మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఒకవేళ ఆకులపై తుప్పురంగు మచ్చలు కనిపిస్తే జింక్ సల్పేట్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి
ప్రస్తుత వాతావరణం దృష్ట్యా నాట్లు ఆలస్యంగా పడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు ఉధృతి పెరిగే అవకాశముంది. వరి నారు మడి నారు తీసేందుకు వారం పది రోజుల ముందు తప్పని సరిగా కార్భోఫ్యూరాన్ 3జీ గుళికలు 800 గ్రాములు ఎకరాకు సరిపోయే 2 గుంటల నారుమడికి వేయాలి
నారు మడుల్లో అగ్గితెగులు సోకే అవకాశాలు ఉన్నాయి. దాని నివారణకు ట్రైసైక్లోజోల్ +మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ఐసోప్రోథాయోలోన్ 1.5మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నాటు వేసేటప్పుడు కొనలను తుంచి, వేసుకోవాలి. నాటిన 18-25రోజుల లోపు కార్భోఫ్యూరాన్ 3జీ గుళికలు ఎకరాకు 10 కిలోలు నీరు పలుచగా ఉంచి వేసుకోవాలి.
నాట్లు వేసిన రైతాంగం వర్షాలతో 3-5రోజులలోపు కలుపు మందులు వేసుకోలేనప్పుడు ఆ తర్వాత కలుపు మందులు వాడుకోవాలి. వరి నాటిన 10-15 రోజుల లోపు తుంగ, వెడల్పాకు కలుపు సమస్య ఉంటే పెనాక్సులం 400మి.లీ లేదా గడ్డి, వెడల్పాకు కలుపు సమస్య ఉంటే బిస్ఫైరీ బ్యాక్ సోడియం 100 మి.లీ లేదా గడ్డి, తుంగ సమస్య అధికంగా ఉంటే పెనాక్సులం +సైహాలోఫాప్ పి బ్యూటైల్ 800 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాల్వశ్రీరాంపూర్, జూలై 17: భారీ వర్షాల నేపథ్యంలో పంటలను ఎలా కాపాడుకోవాలి. సస్యరక్షణ చర్యలు ఏమి తీసుకోవాలి. చేపట్టాల్సిన చర్యలపై కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిద్ది శ్రీధర్, దేవ అనిల్ తెలిపారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వారం రోజులు ముసురు, చిరుజల్లులు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరికొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటలకు నష్టం జరుగకుండా రైతాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలపై శాస్త్రవేత్తలు వివరించారు.
పత్తి: ప్రస్తుతం పత్తి 25-30 రోజుల దశలో ఉంది. అధిక వర్షాల నుంచి పంటను కాపాడేందుకు నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. నేల ద్వారా వ్యాపించే తెగుళ్లతో పత్తి ఎండిపోయే ప్రమాదం ఉంది. దాని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి లేదా కార్బెండిజమ్ + మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కల అడుగు బాగం తడిసేలా పిచికారీ చేయాలి.
వర్షాలు ఆగిన తర్వాత ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. పంట త్వరగా కోలుకునేందుకు 10 గ్రాముల 19.19.19 లేదా మల్టీ కే (13.04.45) లేదా యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు గుంటుక లేదా గొర్రుతో అంతర కృషి చేసి కలుపు నివారించాలి. గడ్డిజాతి, వెడల్పాటి కలుపు మొక్కల నివారణకు క్విజలోపాఫ్ ఈథైల్ 2 మి.లీ, +పైరితయోబ్యాక్ సోడియం 1.25 మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్క జొన్న : మొక్కజొన్న మొలక దశ నీటి ముంపునకు అత్యంత సున్నిత దశ. ఏ మాత్రం నీటి ముంపును తట్టుకోలేదు. కాబట్టి మొక్కల సాళ్ల మధ్యన నీరు నిల్వ ఉండకుండా బయటికి పోయేలా చేయాలి. అధిక తేమతో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలు ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుంది. వర్షాలు ఆగిన తర్వాత డీఏపీ 20 గ్రాములు/లీటరు నీటికి లేదా 19.19.19 5గ్రాములు లీటరు నీటికి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. వర్షాలు ఆగిన తర్వాత కత్తెర పురుగు గమనిస్తే క్లోరాంత్రనిలిప్రోల్ 0.4మి.లీ నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి. వర్షాలు ఆగిన తర్వాత అదనపు మోతాదుగా ఎకరాకు 20కిలోల యూరియా 10కిలోల పొటాష్ వేసుకోవాలి.
– దేవ అనిల్, వ్యవసాయ శాస్త్రవేత్త,కూనారం పరిశోధనా కేంద్రం