కరీంనగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చిన్న నీటి వనరులు నామ రూపాల్లేకుండా పోయాయి. అప్పట్లో ప్రతి వర్షాకాలం చెరువులు తెగిపోవడం, ఏండ్లకు ఏండ్లు గండ్లు పూడ్చకుండా నిర్లక్ష్యానికి గురి చేయడంతో చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. పూడిక నిండిన చెరువుల్లో చేరిన నీళ్లు కొద్ది రోజులు కూడా ఉండేవి కాదు. దీంతో ఎంత వర్షం కురిసినా ఒక్క సీజన్‌కు కూడా చెరువుల్లో నీళ్లు సరిపడేవి కావు. అయినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతి వానకాలం సీజన్‌కు ముందు నీటి పారుదల శాఖ అధికారులు తెగిన చెరువులు, కుంటల లెక్కలు వేసేందుకు గ్రామాల్లో పర్యటించారే తప్ప ఒక్క చెరువు బాగు చేయించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులకు జీవం పోశారు. ‘మిషన్ కాకతీయ’ పేరిట పునరుద్ధరణకు పూనుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,526 చెరువులు ఉండగా, సర్కారు విడుతల వారీగా మరమ్మతులు చేపట్టింది. చెరువు విస్తీర్ణాన్ని బట్టి 15 లక్షల నుంచి మొదలు కొని కోటి వ్యయంతో పునరుద్ధరించింది. పూడికతీయడంతోపాటు కట్ట ఎత్తు, వెడల్పు పెంచింది. మత్తళ్లు, తూములు నిర్మించింది. తూములు, మత్తళ్లు, కాలువలను బాగు చేసింది. మొత్తంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నాలుగు విడుతల్లో దాదాపు 3వేల చెరువులకు పునర్జీవం పోసింది. ఇప్పుడు ఎంత భారీ వర్షాలు కురిసినా, చెరువుల్లోకి వరద పోటెత్తినా చెక్కు చెదరకుండా నిలబడుతున్నాయి. తూములు, మత్తళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇది చూసిన రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నాడు గట్టి వానస్తే చెరువు తెగిపోయే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వివరిస్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషేనని, ఆయనకు రైతులంతా రుణపడి ఉంటారని కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఎన్కట ఒక్క వాన పడ్డా కొట్టుకుపోయేది..ఇప్పుడెన్ని వానలు పడ్డా తెగుతలేదు
మాది గంభీరావుపేట మండలకేంద్రం. నాకు నమాజ్ చెరువు కింద రెండెకరాల భూమి ఉండేది. ఒకప్పుడు మంచిగనే ఎవుసం చేసుకున్న. కానీ రానురాను మా చెరువును ఎవరూ పట్టించుకోక పూడికమట్టితో నిండిపోయింది. నీళ్ల కన్నా ఎటు చూసినా పాలసముద్రం, తుమ్మచెట్లే కనిపించేటియి. వానకాలంల రెండ్రోజులు చిన్నపాటి వానపడితే చాలు చెరువు నిండి కట్టతెగిపోయేది. ఏటా చెరువు తెగుడు, నీళ్లన్నీ పోవుడే అయితుండె. చెరువును మంచిగ జేసేతందుకు రెండు మూడు నెలలు పడుతుండె. ఇగ ఎవుసం ఎట్ల నడుస్తంది. గీ గోస పడలేక ఉన్న పొలం నాడే అమ్ముకున్న. కేటీఆర్ సార్ దయవల్ల నమాజ్ చెరువు మంచిగ తయారైంది. పూడికపోయింది. చెరువులో నీళ్లు, చాపలే కనిపిస్తున్నయ్. ఇప్పుడు ఎన్ని వానలు పడ్డా కట్ట తెగుతలేదు. పొలం ఎందుకమ్మున్నరా దేవుడా..? అని ఇప్పుడు బాధపడుతున్న.
– దీటి బాలయ్య, రైతు (గంభీరావుపేట)
2010లో ఒక్క వర్షానికే 240 చెరువులు తెగినయ్..
గతంలో చెరువులు, కుంటలు వర్షాలకు బాగా దెబ్బతినేవి. 2010 జూలై 30న కురిసిన అతి భారీ వర్షాలకు పూర్వపు మంథని డివిజన్లోని ఏడు మండలాల్లో ఒక్క రోజే 240 చెరువులు, కుంటలు తెగిపోయాయి. కానీ 2015-16నుంచి ప్రారంభమైన మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో చెరువులు బలోపేతమయ్యాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు కట్టలు బలిష్టంగా తయారయ్యాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీ వర్షాలు కురిసినా కట్టలు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అది మిషన్‌కాకతీయ పథకం ఫలాలే అని చెప్పవచ్చు.
– రమేశ్ బాబు, ఐబీ డీఈ (పెద్దపల్లి)
ఎన్ని వానలు పడ్డా కట్ట తెగలె..
మిషన్ కాకతీయ కింద మా ఊరి చెరువును బాగు చేసిన్రు. మత్తళ్లు, తూములను మంచిగ చేసిన్రు. కట్టల ఎత్తు పెంచి బలంగా చేసిన్రు. గతంల మా ఊళ్లే చెరువున్నట్టే ఎవలికీ తెలువది. నీళ్లుండకపోతుండె. పూడికతో నిండి అన్నీ చెట్లే ఉంటుండె. కానీ కేసీఆర్ సారు పుణ్యమా అని మా చెరువు బాగైంది. ఇగ ఇదివరకైతే చిన్న వరదకే చెరువుల కట్టలు తెగిపోయేటియి. మిషన్ కాకతీయ పుణ్యమా అని మా చెరువు బలిష్టంగా తయారైంది. మొన్న గన్ని వానలు పడ్డా కట్ట తెగలే.
– కొండ్ర రాజయ్య, సర్పంచ్, కాచాపూర్(శంకరపట్నం)
కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,376 చెరువులు, కుంటలు ఉన్నాయి. మొదటి విడుతలో రూ.87కోట్లతో 222 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 218 పనులు పూర్తి చేశారు. 2015-16లో రెండో విడుతలో రూ.123 కోట్లతో 291 చెరువుల మరమ్మతులు చేపట్టి 210 పనులు పూర్తి చేశారు. 2016-17లో మూడో విడుతలో రూ.189 కోట్లతో 355 చెరువులను తీసుకుని 160 పూర్తి చేశారు. ఇక 2017-18లో నాలుగో విడుత కింద రూ.33 కోట్లతో 125 చెరువులను తీసుకుని ఇప్పటి వరకు 26 పనులు పూర్తి చేశారు. మొత్తంగా చూస్తే జిల్లాలో రూ.432 కోట్లతో 993 చెరువులను తీసుకుని 614 పనులు పూర్తి చేశారు. మిగతావి ప్రగతిలో ఉన్నాయి.