ముకరంపుర, జూలై 16: జిల్లాలోని రేషన్ డీలర్లకు పౌర సరఫరాల శాఖ కొత్త ఎలక్ట్రానిక్ కాంటాలు అందిస్తున్నది. ఈ మేరకు జిల్లాకు 487 కేటాయించింది. వీటిని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో భద్రపర్చారు. కరీంనగర్‌కు 218, చొప్పదండికి 102, హుజూరాబాద్‌కు 89, జమ్మికుంటకు 78 కేటాయించారు. ఇప్పటికే డీలర్లకు ఈ-పాస్ యంత్రాలతో పాటు బ్లూటూత్ సాంకేతికతతో వాటికి అనుసంధానమై ఉండే ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటిపై కేవలం 60 కిలోల బరువును మాత్రమే తూకం వేసే వీలుంది.
ప్రస్తుతం అందిస్తున్న కొత్త కాంటాలపై 100 కిలోల బరువును కాంటా వేయవచ్చు. ఈ మేరకు శనివారం మార్కెట్ యార్డులో కరీంనగర్‌తో పాటు సమీప మండలాలకు చెందిన డీలర్లకు కొత్త ఎలక్ట్రానిక్ కాంటాలు అందజేశారు. ఇవి వచ్చే నెల నుంచి వినియోగంలోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా.. కొత్త కాంటాతో పాటు పేపర్ రోల్స్, యూఎస్బీ కేబుల్, ఆర్జే11 కేబుల్, ఈ-పాస్ యంత్రం, ఎలక్ట్రానిక్ కాంటా వినియోగించే విధానం, నిర్వహణ, సర్వీసింగ్‌కు సంబంధించిన వివరాలతో కూడిన క్యాలెండర్‌ను రేషన్ డీలర్లకు అందజేస్తున్నట్లు ఈ-పాస్ జిల్లా కో-ఆర్డినేటర్ సంకీర్త్ తెలిపారు.