హుజూరాబాద్ రూరల్, జూలై 16: ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కొందరు వరి నాట్ల కోసం దుక్కి దున్నుతుండగా, ఇప్పటికే నార్లు సిద్ధం చేసుకున్నవారు నాట్లు వేస్తున్నారు. ఈ సీజన్లో రుతుపవనాలు పది హేను రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురువడం.. చెరువులు, కుంటలు నిండుకుండలా మారడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హుజూరాబాద్ డివిజన్లోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో వానకాలంలో లక్షా 18వేల పైచిలుకు ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 85,300 ఎకరాల్లో వరి, 25,077 ఎకరాల్లో పత్తి, మూడు వేల ఎకరాల్లో మక్క, ఇతరత్రా పంటలు మరో ఐదు వేల పైచిలుకు ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ బావుల కింద సన్నరకం వరి నార్లు పోసి నాట్లు వేస్తున్నారు. జూన్ చివరి వారంలో దొడ్డు రకం నార్లు పోశారు. ఇక జూన్ మొదటి వారంలో కురిసిన చిరుజల్లులకు కొందరు పత్తి విత్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో తెగుళ్లు ఆశించే అవకాశం ఉండడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తూ సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులకు ఎలాంటి సమస్య రానివ్వం
రైతులకు ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నాం. అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు ఇస్తున్నాం. పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో కొన్ని చోట్ల పత్తి పంట ఎరుపు రంగులోకి మారింది. అలాగే వరి నారు బాగా పెరిగింది. రైతులు ఆందోళన చెందొద్దు. సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడి సాధించవచ్చు. వరి నారు పైరు కొసలు తుంచి, పాదుల దగ్గరగా వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది.
-సునీల్‌కుమార్, మండల వ్యవసాయాధికారి, హుజూరాబాద్