సారంగాపూర్, జూలై 16: ‘ కొన్నేండ్లలో ఎన్నడూలేనివిధంగా రికార్డుస్థాయిలో వర్షం కురిసింది..ఈ నేపథ్యంలోనే పెను నష్టం వాటిల్లింది.’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ముంపు బాధితులకు సర్కారు అండగా ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాల పాలిత రాష్ర్టాల్లో ఫసల్ బీమా అమలుతీరు ఎలా ఉన్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. వరదలతో తెగిపోయిన బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ పాత కట్టను ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
జగిత్యాల నియోజకవర్గంలో జూలై తొలి రెండువారాల్లో 3562 మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. భారీ వర్షాలకు రోళ్లవాగు పాత కట్ట, అరగుండాల ప్రాజెక్ట్, రహదారులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కొట్టుకుపోయాయన్నారు. సమస్యను మంత్రి కొప్పుల సహకారంతో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వ్యవసాయ రంగం తిరిగిపుంజుకునేలా తగిన చర్యలు చేపడతామన్నారు.
ఎన్టీవీ విలేకరి జమీర్ మరణం బాధాకరమని వ్యాఖ్యానించారు. ముందస్తుగా తీసుకున్న చర్యలతోనే ఆస్తి, ప్రాణనష్టం తగ్గిందన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతు బీర్పూర్, ధర్మపురి మండలాలకు లబ్ధిచేకూరేలా సీఎం కేసీఆర్ రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. అంతకుముందు అర్పల్లిలో తెగిపోయిన పటేళ్లకుంట చెరువును పరిశీలించారు. మరమ్మతు వివరాలు తెలుసుకున్నారు. ఇండ్లు దెబ్బతిని నష్టపోయిన గ్రామానికి చెందిన తోట పోచవ్వ, దుబ్బయ్య ,దమ్మ గండారెడ్డికి రూ. 3200 చొప్పున పరిహారం అందజేశారు. అనంతరం గ్రామంలోని మార్కండేయ ఆలయంలో పూజలు చేశారు.
మొదటి సారి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీని సర్పంచ్ కొండ శ్రీలతా ప్రభాకర్ సన్మానించారు. కార్యక్రమాల్లో జిల్లా కేడీసీసీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ కొల్ముల రమణ, ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సొల్లు సురేందర్, పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శులు తోడేటి శేఖర్ గౌడ్, శీలం రమేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, రామకిష్టు గంగాధర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్ల మైపాల్‌రెడ్డి, నేతలు కొల్ముల శారద, ముక్క శంకర్, కోల శ్రీనివాస్, మెరుగు రాజేశం, డీఈ ఛక్రునాయక్, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో మల్లారెడ్డి, ఆలయ చైర్మన్ నేరళ్ల సుమన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.