గంగాధర, జూలై 1: గంగాధర మోడల్ స్కూల్ న్యాలకొండన్నపల్లి సమీపంలో ఉంటుంది. ఐదెకరాల విస్తీర్ణంలో పాఠశాల భవనం, మైదానం ఉంటాయి. అన్ని వసతులతో కూడిన సువిశాల భవనంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సెక్షన్‌కు 50 మంది చొప్పున 500 మంది, ఇంటర్మీడియెట్‌లో 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ క్రమశిక్షణతో నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సైన్స్‌ల్యాబ్‌లో ప్రయోగాలు చేయిస్తున్నారు. గ్రంథాలయంలో వందలాది పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఎన్సీసీ, స్కౌట్స్గైడ్లో శిక్షణ ఇస్తున్నారు. క్రీడలు, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తున్నారు. 100 మంది బాలికల హాస్టల్లో ఉండగా, ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు రాయితీ బస్సు పాసుల ద్వారా పాఠశాలకు వస్తున్నారు. ప్రిన్సిపాల్ గోల్డీ బల్బీర్‌కౌర్, వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు క్రమశిక్షణతో చదవి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. చదువుతోపాటు క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ మెరుస్తున్నారు. అందుకే ఈ యేడాది 6వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థులు పోటీ పడ్డారు. 100 సీట్లు ఉండగా, 407 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఏడేళ్లుగా వంద శాతం ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో ఏడేళ్లుగా ఈ పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నది. ఇప్పటి వరకు 156 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. జాతీయ ప్రతిభ పరీక్ష ద్వారా 45 మంది, ఎంహెచ్ఆర్డీ ద్వారా 56 మంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందుతున్నారు. 70 మంది బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ఈ యేడాది 20 మంది 10 జీపీఏ సాధించి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.
ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైంది
మా పాఠశాల రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తున్నది. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన బోధనతో 20 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు పేరు తెచ్చారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. నిరంతరం మోటివేట్ చేస్తూ పరీక్షకు సిద్ధం చేశాం. తల్లిదండ్రుల సహకారం కూడా మరువలేనిది. ఉదయం 7 గంటలకు స్టడీ అవర్ నిర్వహిస్తే క్రమం తప్పకుండా సమయానికి తరగతులకు హాజరయ్యేలా చూశారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థుల పేర్లను వాల్ పెయింటింగ్ చేయించి భవిష్యత్‌లో పరీక్ష రాసే విద్యార్థులకు ఆదర్శంగా చూపుతాం.